నందమూరి హీరోలు ఈ ఏడాది జూలు విదిల్చారనే చెప్పాలి.. అటు అఖండతో బాలయ్య .. ఇటు ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్.. ఇప్పుడు బింబిసార సినిమాతో కళ్యాణ్ రామ్(Nandamuri Kalyan Ram)ఇలా ముగ్గురు హీరోలు సూపర్ హిట్స్ తో ఈ ఏడాది సత్తా చాటారు. వశిష్ఠ దర్శకత్వంలో వచ్చిన బింబిసార సినిమా రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో చాలా కాలం తరవాత హిట్ కొట్టారు కళ్యాణ్ రామ్. అప్పుడెప్పుడో వచ్చిన పటాస్ సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అందుకోలేక పోయారు కళ్యాణ్ రామ్. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నప్పటికీ సాలిడ్ హిట్ మాత్రం పడలేదు ఈ యాక్షన్ హీరోకి. ఇక కళ్యాణ్ రామ్ ప్రయోగాలు చేయడానికి కూడా వెనకాడరు.. ఆమధ్య ఓం 3డి అనే సినిమా చేశారు. కానీ ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేక పోయింది. ఇక ఇప్పుడు హిస్టారికల్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు.
త్రిగర్తల సామ్రాజ్య అధిపతి అయిన బింబిసారుడి కథను సినిమాగా తెరకెక్కించి సక్సెస్ అయ్యారు దర్శకుడు వశిష్ఠ. మొదటి షో నుంచి ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వచింది. ఇప్పుడు హిట్ నుంచి బ్లాక్ బస్టర్ వైపు పరుగులు పెడుతోంది ఈ సినిమా. ఇక ఈ సినిమాతో నందమూరి అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు. తమ హీరోకు సాలిడ్ హిట్ దక్కిందని సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే కళ్యాణ్ రామ్ నటిస్తున్న నెక్స్ట్ సినిమాలపై అంచనాలు పెరిగిపోయాయి. కళ్యాణ్ నెక్ట్స్ డెవిల్ అనే సినిమా చేస్తున్నారు. డెవిల్ సినిమా ను 1940 కాలంకు పూర్వం కథతో రూపొందిస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే విడుదల అయిన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పుడు ఈ సినిమా పై బోలెడన్ని ఆశలతో ఉన్నారు నందమూరి ఫ్యాన్. మరి కళ్యాణ్ రామ్ మరోసారి అభిమానుల అంచనాలు అందుకుంటాడేమో చూడాలి.