బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఆదిపురుష్. రామాయణం ఇతిహాసం ఆధారంగా రూపొందించిన ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించగా.. కృతి సనన్ సీతాదేవిగా, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించారు. అయితే ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా తీవ్ర స్థాయిలో వివాదాలు ఎదుర్కొంటుంది. ఇందులో రామాయణాన్ని అపహాస్యం చేశారంటూ ఓంరౌత్ పై విమర్శలు వస్తున్నాయి. అయితే ప్రభాస్, కృతి సనన్, సైఫ్ నటనపై మాత్రం ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతేకాదు.. ప్రభాస్ తొలిసారిగా పౌరాణిక చిత్రంలో నటించడంతో తొలి రోజే ఏకంగా రూ.145 కోట్లకు పైగా రాబట్టి సెన్సెషన్ క్రియేట్ చేసింది. ఇక ఆ తర్వాత రెండు రోజులుగా భారీగానే వసూళ్లు వచ్చినప్పటికీ… ఆ తర్వాత మాత్రం కలెక్షన్స్ తగ్గిపోయాయి. 7, 8 వ రోజులలో కేవలం లక్షలలోనే వసూళ్లు వచ్చాయి. అయితే ఆదిపురుష్ చిత్రబృందానికి ఈ వీకెండ్ కలిసొచ్చిందనే చెప్పుకోవాలి.
ఇక వారం రోజుల తర్వాత టికెట్ ధరలు గణనీయంగా తగ్గించారు. 3డీ స్క్రీన్స్ పైన కూడా టికెట్స్ రెట్లు తగ్గించారు. దీంతో ఆదివారం థియేటర్లలో 80 శాతం ఆక్యుపెన్సీ కనిపించింది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ బుకింగ్స్ కనిపించాయి. మొదటి మూడు రోజుల్లో రూ.340 కోట్లు.. ఆ తర్వాత ఏడు రోజుల్లో రూ.110 కోట్లు మాత్రమే రాబట్టగలిగింది. ఇక మొత్తం పదిరోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లు వసూలు చేసిందని చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ చిత్రాన్ని తెలుగులో యూవీ క్రియేషన్స్ తోపాటు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ రిలీజ్ చేసింది.
ఆదిపురుష్ సినిమాను రూ. 600 కోట్ల బడ్జెట్తో టీసిరీస్ బ్యానర్ పై నిర్మించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమాపై మాత్రం ఇప్పటికీ విమర్శలు తగ్గడం లేదు. ముఖ్యంగా ఇందులో హనుమ చెప్పిన డైలాగ్స్, సీన్స్ విషయంలో సినీ ప్రియులు మాత్రమే కాదు.. సినీప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో చిత్రయూనిట్ వెనక్కు తగ్గి.. డైలాగ్స్, సీన్స్ విషయంలో మార్పులు చేసింది. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.