Chiranjeevi: ఒకసారి చెల్లిగా.. మరోసారి ప్రేయసిగా! చిరంజీవితో ఆ ఐదుగురు భామల అరుదైన బంధం!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం ఒక అద్భుతం. అనితర సాధ్యం. ఆయనతో కనీసం ఒక్క సినిమాలోనైనా కలిసి నటించాలని ప్రతి హీరోయిన్ కలలు కంటుంది. అయితే ఆయన సుదీర్ఘ సినీ ప్రయాణంలో కొందరు హీరోయిన్లకు చాలా అరుదైన అవకాశాలు దక్కించుకున్నారు.

Chiranjeevi: ఒకసారి చెల్లిగా.. మరోసారి ప్రేయసిగా! చిరంజీవితో ఆ ఐదుగురు భామల అరుదైన బంధం!
Chiranjeevi

Updated on: Jan 25, 2026 | 6:00 AM

సాధారణంగా ఒకసారి చెల్లెలి పాత్రలో కనిపిస్తే, ఆ తర్వాత హీరోయిన్‌గా అంగీకరించడం ప్రేక్షకులకు కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. కానీ నటనలో ప్రావీణ్యం ఉన్న కొందరు భామలు మాత్రం చిరంజీవికి సోదరిగా నటించి ఏడిపించారు.. ఆ తర్వాత హీరోయిన్‌గా నటించి ఆయనతో డ్యూయెట్లు పాడుతూ మెప్పించారు. ఈ జాబితాలో ఒకప్పటి స్టార్ హీరోయిన్లు మాత్రమే కాకుండా, నేటి తరం ‘లేడీ సూపర్ స్టార్’ కూడా ఉండటం విశేషం. ఇంతకీ చిరంజీవికి అటు సోదరిగా, ఇటు ప్రేయసిగా నటించిన ఆ టాలెంటెడ్ హీరోయిన్లు ఎవరు? వారి కాంబినేషన్లలో వచ్చిన ఆ ప్రత్యేకమైన సినిమాలు ఏవో తెలుసుకుందాం..

నయనతార

ఈ జాబితాలో మనం ముందుగా చెప్పుకోవాల్సింది నయనతార గురించి. చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత ఆయనతో కలిసి నటించిన అతికొద్ది మంది అగ్ర హీరోయిన్లలో ఈమె ఒకరు. ‘సైరా నరసింహారెడ్డి’లో చిరంజీవికి భార్యగా (నటించి మెప్పించిన నయనతార, ఆ తర్వాత ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఆయనకు సోదరిగా కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. హీరోయిన్‌గా నటించిన కొద్ది కాలానికే సోదరి పాత్రను అంగీకరించి తన నటనపై ఉన్న మక్కువను చాటిచెప్పారు. ఇటీవల రిలీజైన ‘మన శంకర వరప్రసాద్​’ సినిమాలోనూ చిరంజీవికి జంటగా నటించి ప్రేక్షకులను మెప్పించింది నయన్.

ఖుష్బూ

సౌత్ ఇండియాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఖుష్బూ, చిరంజీవితో ఉన్న బంధం ఎంతో ప్రత్యేకం. ‘కిరాతకుడు’, ‘శాంతి నివాసం’ వంటి హిట్ సినిమాల్లో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించిన ఖుష్బూ, చాలా ఏళ్ల విరామం తర్వాత చిరంజీవి రీ-ఎంట్రీ తర్వాత ‘స్టాలిన్’ సినిమాలో ఆయనకు అక్కగా నటించారు. ఆ సినిమాలో అక్కాతమ్ముళ్ల మధ్య ఉండే సెంటిమెంట్ కథకు వెన్నెముకగా నిలిచింది.

Nayanthara Vijayashanti And Khushboo

రాధిక

చిరంజీవికి అత్యంత సన్నిహిత స్నేహితుల్లో రాధిక ఒకరు. వీరిద్దరి కాంబినేషన్‌లో డజనుకు పైగా సినిమాలు వచ్చాయి. ‘న్యాయం కావాలి’ వంటి సినిమాల్లో వీరిద్దరి మధ్య అన్నచెల్లెళ్ల అనుబంధం ఎంతో హృద్యంగా సాగుతుంది. ఆ తర్వాత ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘అభిలాష’, ‘రాక్షసుడు’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాల్లో రాధిక చిరంజీవికి జోడీగా నటించి మెప్పించారు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

సుహాసిని

సుహాసిని కూడా చిరంజీవితో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించారు. ‘మగమహారాజు’ సినిమాలో చిరంజీవికి సోదరిగా సుహాసిని నటించారు. ఆ సినిమాలో అన్నచెల్లెళ్ల సెంటిమెంట్ ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఆ తర్వాత ‘మరణ మృదంగం’, ‘కిరాతకుడు’, ‘చంటబ్బాయ్’ వంటి సినిమాల్లో చిరంజీవి సరసన హీరోయిన్‌గా నటించి తన నటనతో ఆకట్టుకున్నారు. ఒక పక్కన సెంటిమెంట్ పండించినా, మరోపక్క గ్లామరస్ రోల్స్ లో కూడా ఆమె ఒదిగిపోయారు.

విజయశాంతి

చిరంజీవి – విజయశాంతి కాంబినేషన్ అంటే అప్పట్లో ఒక బ్రాండ్. వీరిద్దరూ కలిసి సుమారు 19 సినిమాల్లో నటించారు. వీరిద్దరి కెరీర్ తొలినాళ్లలో వచ్చిన ‘సంఘర్షణ’ వంటి సినిమాల్లో సోదరిగా కనిపించిన విజయశాంతి, ఆ తర్వాత ‘గ్యాంగ్ లీడర్’, ‘ఛాలెంజ్’, ‘స్వయంకృషి’ వంటి సినిమాల్లో చిరంజీవికి జోడీగా నటించారు. విజయశాంతి చిరంజీవికి సరిజోడీ అనిపించుకోవడమే కాకుండా, తన నటనతో ‘లేడీ అమితాబ్’ గా పేరు తెచ్చుకున్నారు.

ఒక నటుడిగా చిరంజీవి గొప్పతనం ఏంటంటే.. తన పక్కన ఉన్న నటి ఏ పాత్ర చేసినా, ఆ పాత్రకు తగినట్టుగా తనను తాను మలచుకోవడం. అందుకే సోదరిగా నటించిన హీరోయిన్లతోనే మళ్లీ హీరోయిన్లుగా నటించినా ప్రేక్షకులు ఆదరించారు. నటనలో ప్రతిభ ఉంటే ఏ పాత్రనైనా ప్రేక్షకులు మెచ్చుకుంటారని ఈ హీరోయిన్లు నిరూపించారు.