
మాతృత్వంలోనే ఓ మహిళ జీవితం పరిపూర్ణం అవుతుందంటారు. అందుకే పెళ్లి చేసుకున్న ప్రతి అమ్మాయి తల్లి కావాలని కోరుకుంటుంది. అయితే ప్రస్తుతం జనరేషన్ లో కొందరు ప్రెగ్నెన్సీని లేట్ గా ప్లాన్ చేసుకుంటున్నారు. లైఫ్ లో సెటిల్ అయ్యాకే పిల్లలను కందామనుకుంటున్నారు. ఇంకొందరైతే అసలు పిల్లలే వద్దనుకుంటున్నారే. అందుకు ఎవరి కారణాలు వాళ్లకు ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలోకి ఒక టాలీవుడ్ స్టార్ హీరోయిన్ చేరింది. కొన్ని రోజుల క్రితమే ప్రేమ వివాహం చేసుకున్న ఈ అందాల తార తనకు అసలు పిల్లల్ని కనాలనే ఆలోచన లేదని కుండబద్దలు కొట్టేసింది. అందుకు గల కారణాన్ని కూడా బయటపెట్టిందీ ముద్దుగుమ్మ.
‘నాకు తెలిసి అమ్మతనం అనేది చాలా పెద్ద బాధ్యత. పిలల్ని కన్నంత మాత్రాన తల్లి అయిపోలేరు. ఎందుకంటే నేను నా చెల్లికి తల్లిగా ఉంటాను. నా పెట్ డాగ్స్ కు కూడా తల్లిగా వ్యవహరిస్తా. అలాగే నా స్నేహితులు, సన్నిహితులను తల్లిలా చూసుకుంటాను. సాయం కావాల్సిన వాళ్లకు తల్లిగా తోడుంటాను. నా వరకు అమ్మతనం అంటే అర్థమిదే. నాకు వ్యక్తిగతంగా అయితే పిల్లల్ని కనాలనే ఆలోచన లేదు. భవిష్యత్‌లో ఏమైనా జరగొచ్చు. ఎందుకంటే ఒకానొక సందర్భంలో అసలు పెళ్లే వద్దనుకున్నాను. కాబట్టి ఫ్యూచర్ లో ఏమైనా జరగొచ్చు’ అని చెప్పుకొచ్చిందీ అందాల తార.
ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరనుకుంటున్నారా? ప్రస్తుతం తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ రోల్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన వరలక్ష్మీ శరత్ కుమార్. గతేడాది నికోలాయ్ సచ్‌దేవ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుందీ అందాల తార. పెళ్లి తర్వాత యాక్టింగ్ నుంచి కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న ఈ అందాల తార మళ్లీ సినిమాలు, వెబ్ సిరీసులతో బిజీగా మారింది. కాగా వరలక్ష్మీ పిల్లలు వద్దనుకోవడానికి చాలా కారణాలే ఉన్నట్లు తెలుస్తోంది. చిన్నతనంలోనే ఆమె లైంగిక వేధింపులకు గురైంది. దీనికి తోడు నటి తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నారు. తల్లి ఛాయాదేవి నుంచి విడిపోయిన తర్వాత శరత్ కుమార్, నటి రాధికని పెళ్లిచేసుకున్నారు. అందుకే తనలా తన పిల్లలు ఇబ్బంది పడకూడదనే వరలక్ష్మీ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.