
స్టార్ హీరోయిన్ సమంత చాలా రోజుల తర్వాత ‘మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నందిని రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టే ఇప్పటివరకు రిలీజైన టీజర్స్, ట్రైలర్ సాంగ్స్, ఇతరత్రా కంటెంట్ ఆడియెన్స్ ను బాగానే ఆకట్టుకుంది. అన్ని హంగులు పూర్తి చేసుకున్న మా ఇంటి బంగారం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీ బిజీగా ఉంటోంది. సమంతతో సహా చిత్ర బృందమంతా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో ‘మా ఇంటి బంగారం’ సినిమా గురించి సమంత చెప్పిన ఓ విషయం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అదేంటంటే.. మా ఇంటి బంగారం సినిమాలో హీరోయిన్ గా ఫస్ట్ ఆప్షన్ సమంత కాదట. న్యాచురల్ బ్యూటీ సాయిపల్లవిని ఈ మూవీలో హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట. ఇప్పుడు ఈ విషయాన్ని స్వయంగా సమంతే వెల్లడించింది.
‘ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ( సమంత ప్రొడక్షన్ బ్యానర్) ప్రారంభించినప్పుడు మహిళా ప్రాధాన్యత ఉన్న కథలను ప్రోత్సహించాలనే ఆలోచనతో ముందుకు వచ్చాం. అందులో భాగంగానే ‘మా ఇంటి బంగారం’ కథను మొదట సాయిపల్లవికి చెప్పాలని, ఆమెతోనే ఈ సినిమా చేయాలని ప్లాన్ చేశాం. ఆమె నటనకు నేను పెద్ద అభిమానిని. నా బ్యానర్‌లో ఆమె హీరోయిన్‌గా నటిస్తే చాలా బాగుంటుందని అనుకున్నాను. కానీ అప్పట్లో సాయిపల్లవి వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదు. దీంతో ఆ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. అయితే కథను పూర్తిగా పక్కన పెట్టకుండా.. దానిని నాకు సరిపోయేలా మార్చి నేనే హీరోయిన్ గా నటించాలని నిర్ణయించుకున్నాను. ఈ సినిమాను నేను ఎంపిక చేసుకోలేదు. ఈ సినిమానే నన్ను సెలెక్ట్ చేసుకుంది. సాయిపల్లవి చేయలేకపోవడంతో కథలో కొన్ని మార్పులు చేసి నా ఇమేజ్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత నేనే ఈ సినిమాలో నటించాల్సి వచ్చింది’ అని సామ్ చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని సాయి పల్లవి కూడా చెప్పుకొచ్చింది. సమంత ఇన్ స్టా గ్రామ్ స్టోరీని కోట్ చేసిన సాయి పల్లవి… ”ఈ సినిమా కచ్చితంగా సమంత చేయాల్సినదే. అది ఆమె చేయాలని రాసి పెట్టి ఉంది. దర్శకురాలు నందినీ రెడ్డి, సమంతకు బెస్ట్ విషెస్’ అని ప్రేమను, హగ్స్ పంపించింది.
ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత, రాజ్ నిడిమోరు, హిమాంక్ దువ్వూరు సంయుక్తంగా మా ఇంటి బంగారం సినిమాను నిర్మిస్తున్నారు. సమంతతో పాటు దిగంత్, గుల్షన్ దేవయ్య, సీనియర్ నటి గౌతమి, మంజుషా, శ్రీముఖి తదితరులు కీలకపాత్రలు పోషించారు. సంతోష్ నారాయణన్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.