మాస్ మాహారాజా రవితేజ టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘టైగర్ నాగేశ్వర్ రావు’. స్టూవర్ట్ పురంలో పేరు మోసిన గజదొంగ అయిన టైగర్ నాగేశ్వరరావు జీవితకథ ఆధారంగా ఈ మూవీని రూపొందిస్తున్నారు డైరెక్టర్ వంశీ. అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తోన్న ఈ మూవీలో నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. సీనియర్ హీరోయిన్ రేణు దేశాయ్ కీలకపాత్రలో నటిస్తున్నారు. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రేణు.. ఇప్పుడు ఈ మూవీతో తిరిగి రీఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో బడుగు జీవుల వెలుగు కిరణం హేమలత లవణం పాత్రలో రేణు దేశాయ్ కనిపించనుంది. ఈ సినిమా అక్టోబర్ 20న అడియన్స్ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉంది చిత్రయూనిట్. దేశంలోనే గజదొంగగా పేరు మోసిన టైగర్ నాగేశ్వర్ రావు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ మూవీలో నిజ జీవిత పాత్రలు కూడా కనిపించబోతున్నాయి. అందులో భాగంగానే రేణు దేశాయ్ పోషిస్తున్న పాత్ర హేమలత లవణం. ఇంతకీ ఆమె ఎవరు ?. టైగర్ నాగేశ్వర్ రావు కథలో ఆమె పాత్ర ఏంటీ ?అనే విషయాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు సైతం ఆసక్తి చూపిస్తున్నారు.
హేమలత లవణం.. లెజెండరీ రచయిత గుర్రం జాషువా కూతురు. సంఘసంస్కర్త. తన తండ్రి లాగే ఆమె కూడా రచయిత. 1932 ఫిబ్రవరి 26న గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించారు. జాతి వివక్ష, అంటరానితనం వంటి సమస్యలపై జీవితాంతం పోరాడారు. 19వ శతాబ్దంలో తన భర్తతో కలిసి హేమలత.. నేరాలకు పాల్పడే నేరస్తుల్లో పరివర్తన తీసుకువచ్చేందుకు శ్రమించారు. ఎంతో మంది బడుగు జీవుల జీవితాల్లో వెలుగులు నింపారు. ఈ క్రమంలోనే స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావును ఆమె కలుసుకున్నట్లు తెలుస్తోంది. ఆ సన్నివేశాలను ఈ సినిమాలో చూపించనున్నారని తెలుస్తోంది.
అలాగే గుర్రం జాషువా కుమార్తెగా పది గ్రంథాలకు ప్రాణం పోశారు హేమలత లవణం. 2007లో పోట్టి శ్రీరాములు విశ్వ విద్యాలయం ఆమెకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. పేదలు, అభాగ్యులు, దొంగలు అందరి జీవితాల్లో వెలుగులు నింపింది హేమలత లవణం. ఎంతో మంది జీవితాలకు స్పూర్తిదాయకంగా నిలిచిన హేమలత లవణం పాత్రను ఇప్పుడు రేణు దేశాయ్ పోషిస్తున్నారు. ఈ పాత్రతోనే మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు దసరా కానుకగా అక్టోబర్ 20న పాన్ ఇండియా లెవల్లో విడుదల కానుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.