
సినిమా ఇండస్ట్రీలో మరో జంట విడిపోయింది. గతేడాదే పెళ్లి చేసుకున్న ఈ జోడీ కలిసుండలేమంటూ విడాకులు తీసుకుంది. ‘నేను మీ అభిమాన నటిని.. 2025 ఆగస్టు నుంచి సింగిల్‌గానే ఉంటున్నాను. ప్రస్తుతం నేను చాలా అందమైన, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాను’ అని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ టాలీవుడ్ హీరోయిన్. అంతేకాదు తన పెళ్లి ఫోటోలు, వీడియోలను సైతం సోషల్ మీడియా నుంచి డిలీట్ చేసింది. అయితే ఈ హీరోయిన్ ఇలా విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. గతంలోనూ రెండు సార్లు పెళ్లి చేసుకుంది. రెండు సార్లూ విడాకులు తీసుకుంది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి విడాకులు తీసుకుంది. మొత్తానికి గత 20 ఏళ్లలో మూడు పెళ్లిళ్లు చేసుకుని ముగ్గురితోనూ విడిపోయిన ఆ హీరోయిన్ మరెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ మీరా వాసుదేవన్. పేరుకు మలయాళ నటి అయినప్పటికీ ఈ అందాల తార తెలుగు ఆడియెన్స్ కు కూడా పరిచయమే. తెలుగులో చాలా సినిమాల్లో నటించింది. గోల్‌మాల్ అనే తెలుగు సినిమాతోనే హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది మీరా. ఆతర్వాత అంజలి ఐ లవ్యూ అనే సినిమాలోనూ నటించి మెప్పించింది. తెలుగుతో పాటు మలయాళ, తమిళ, హిందీ భాషల్లో పదుల సంఖ్యలో సినిమాలు చేసింది మీరా. ప్రస్తుతం సహాయక నటిగా బిజీ బిజీగా ఉంటోంది.
సినిమాల సంగతి పక్కన పెడితే.. వ్యక్తిగత జీవితంలో చాలా ఒడిదొడుకు ఎదుర్కొంటోంది మీరా వాసుదేవన్. మొదట 2005లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అశోక్ కుమార్ కుమారుడు విశాల్ అగర్వాల్‌ను పెళ్లి చేసుకుంది మీరా. కానీ కొన్నేళ్లకే విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత 2012లో ప్రముఖ నటుడు, విలన్ జాన్ కొక్కెన్‌ను పెళ్లాడింది. వీరికి ఒక బాబు కూడా పుట్టాడు. కానీ కొన్నాళ్లకే ఈ జంట కూడా విడిపోయింది. ఆ తర్వాత కెమెరామెన్ విపిన్‌తో లవ్‌లో పడింది. 2024 మేలో కోయంబత్తూరు వేదికగా పెళ్లిపీటలెక్కారు. అయితే ఇప్పుడు ఈ మూడో పెళ్లి కూడా పెటాకులైంది. భర్తతో విడిపోయినట్లు అధికారికంగా ప్రకటించింది మీరా. ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిందీ అందాల తార.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.