
సీనియర్ నటి శోభన మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు. ప్రభాస్ నటించిన కల్కి సినిమాలో ఓ కీ రోల్ లో కనిపించి ఆకట్టుకున్నారామె. లేటెస్ట్ గా మోహన్ లాల్ హీరోగా నటించిన తుడురుమ్ సినిమాలోనూ అద్భుతంగా యాక్ట్ చేశారు. మోహల్ లాల్ ఇల్లాలిగా, ఇద్దరు పిల్లల తల్లిగా మరోసారి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. కాగా శోభన జీవితంలో ఒక విషాదం చోటు చేసుకుంది. ఆమె చిన్ననాటి స్నేహితురాలిని కోల్పోయారు. తనకు ఎంతో ఇష్టమైన మిత్రురాలు అనిత మీనన్ కన్నుమూశారని ఆమె కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన స్నేహితురాలి మరణానికి సంతాపం ప్రకటించారు శోభన. తన ఫ్రెండ్ తో కలిసున్న చిన్ననాటి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆమె.. ‘ నా ప్రియమైన స్నేహితురాలి ఆత్మకు శాంతి చేకూరాలి. ఇంతకుమించి ఏం మాట్లాడాలో కూడా నాకు తెలియడం లేదు. బాబూ అంకుల్, సూ ఆంటీ, సతీశ్ మీనన్, అవీషా, అనీషా.. మీ అందరికీ నా ప్రగాఢ సానుభూతి’ అని రాసుకొచ్చారు శోభన. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ అభిమానులు, నెటిజన్లు శోభనకు ధైర్యం చెబుతున్నారు.
కాగా ఒకప్పుడు దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు శోభన. తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళం, తమిళం భాషల్లో సుమారు 200 కి పైగా సినిమాల్లో నటించారు శోభన. తన నటనా ప్రతిభకు ప్రతీకగా పద్మశ్రీ వంటి ప్రతిష్ఠాత్మక పురస్కారాలు కూడా అందుకున్నారు. ఇక స్వతహాగా క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఆమె ఒక డ్యాన్స్ స్కూల్ కూడా రన్ చేస్తున్నారు. అయితే ఈ మధ్యన మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ ను ఘనంగా స్టార్ట్ చేశారు శోభన. చేతిలో పలు సినిమాలతో బిజీగా మారారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.