
టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్, బాలీవుడ్ ప్రముఖ నటి అతియా శెట్టి ఇటీవల అమ్మానాన్నలుగా ప్రమోషన్ పొందారు. ఈ ఏడాది మార్చి 24న అతియా శెట్టి పండంటి ఆడ బిడ్డకు జన్మనిచ్చింది. అతియాకు బిడ్డ పుట్టడంతో ఆమె తండ్రి సునీల్ శెట్టి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను తాతయ్యను అన్నానంటూ తెగ సంబరపడిపోతున్నాడు. అయితే ఇదే సమయంలో ప్రసవం గురించి సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ చర్చనీయాంశమమయ్యాయి. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన అతను.. తన కూతురు చాలా కంఫర్టబుల్ గా ఉందని, ఆమె సీ సెక్షన్ (సిజేరియన్)కు వెళ్లకుండా నార్మల్ డెలివరీనే ఎంచుకుందన్నాడు. దీంతో ఈ కామెంట్స్ దుమారం రేపాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సునీల్ కామెంట్స్ ను వ్యతిరేకించాడు. తాజాగా మరో ప్రముఖ నటి గౌహర్ ఖాన్ ఈ విషయంపై స్పందించింది.
ఇటీవల ఓ షోకు హాజరైన గౌహర్ ఖాన్ ‘ఈ మధ్య ఓ సెలబ్రిటీ (సునీల్ శెట్టి) సాధారణ ప్రసవం కన్నా సిజేరియన్ ఆపరేషన్ ఈజీ అన్నారు. ఆ మాట వినగానే నాకు గట్టిగా అరవాలనిపించింది.ఆయన అలా ఎలా అనగలిగారు? అబ్బాయిలకు ప్రెగ్నెన్సీ ఉండదు, నవమాసాలు మోయరు, సీ సెక్షన్ చేస్తే ఆ బాధ ఎలా ఉంటుందో అసలు అర్థం కాదు. మీకసలు ఏదీ తెలీదు’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.
గౌహర్ ఖాన్ కు టాలీవుడ్ తోనూ పరిచయం ఉంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో ‘నా పేరే కాంచనమాల’ అనే స్పెషల్ సాంగ్ లో కనిపించిందీ ఈ ముద్దుగుమ్మనే. పలు బాలీవుడ్ సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ కొరియోగ్రాఫర్ జైద్ దర్బార్‌ను 2020లో పెళ్లి చేసుకుంది. వీరికి 2023లో కుమారుడు జెహాన్ పుట్టాడు. ప్రస్తుతం ఆమె మరోసారి గర్భం దాల్చింది.