Tollywood: టీ షాపు కూల్చేసిన GHMC అధికారులు.. పొట్ట కొట్టారని నటుడి ఆవేదన
హైదరాబాద్‌లో నటుడు పీలా గంగాధర్ తన రూ.3 లక్షల పెట్టుబడిని జీహెచ్ఎంసీ కూల్చివేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సరైన కారణం చెప్పకుండా తన జీవనోపాధిని నాశనం చేశారని, దీనిపై మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ కమిషనర్ శ్రీధర్ శేఖర్ రెడ్డితో మాట్లాడినా ప్రయోజనం లేకపోయిందని ఆయన ఆరోపించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబానికి ఆసరా కోల్పోయానని ఆవేదన చెందాడు.

పీలా గంగాధర్ తెలుగులో మంచి యాక్టర్. ఇప్పుడు కూడా అడపాదడపా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. దాదాపు 70 సినిమాల్లో మంచి పాత్రలు వేశాడు. ముఖ్యంగా కామెడీ పాత్రలు పోషిస్తూ.. రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. అయితే సినిమాల్లో చాన్సులు తగ్గిపోవడం, కుటుంబ భారం, ఆర్థిక సమస్యలతో శ్రీనగర్ కాలనీలో ఓ టీ షాపు పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. అయితే తాజాగా అతని టీ షాపుకు అనుమతి లేదంటూ GHMC అధికారులు దాన్ని కూల్చేయడంతో అతను తీవ్ర ఆవేదనతో వీడియో రిలీజ్ చేశాడు.
దాదాపు రూ.3 లక్షలు పెట్టుబడిగా పెట్టి ఏర్పాటు చేసుకున్న తన షాపును సరైన కారణం చెప్పకుండానే సెకన్లలో కూల్చివేశారని గంగాధర్ ఆరోపించారు. తాను ఒక యాక్టర్ అని, బతుకు తెరువు కోసం ఈ చిన్న వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నానని ఆయన తెలిపాడు. ఈ విషయంలో జిహెచ్ఎంసి ఆఫీసుకు వెళ్లి వెండార్ లైసెన్సు, ఎన్.ఓ.సి (నిరభ్యంతర పత్రం) కూడా తీసుకువచ్చానని తెలిపారు. కాలనీ లోపల, ఎవరికీ ఇబ్బంది లేకుండా ఒక పక్కగా తన బండిని పెట్టుకున్నానని చెప్పారు. అయినప్పటికీ, కూల్చివేత సమయంలో అధికారులు ఎలాంటి నిర్దిష్ట కారణం చెప్పడానికి నిరాకరించారని ఆయన వాపోయారు. అధికారులను తాను కేవలం రిక్వెస్ట్‌గా అడిగానని, రూడ్‌గా మాట్లాడట్లేదని స్పష్టం చేశాడు.
కుటుంబంలో తల్లిదండ్రులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, అన్నయ్య బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధపడుతున్నారని, అక్కయ్యకు కూడా ఆరోగ్య సమస్యలు ఉన్నాయని తెలిపారు. తన నటన వృత్తితో పాటు ఈ వ్యాపారం ద్వారా వచ్చే ఆదాయంతోనే కుటుంబ పోషణ సాగిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. అధికారులు కూల్చివేతకు సరైన రీజన్ చెబితే తాను అర్థం చేసుకుంటానని, అయితే కారణం చెప్పకుండా తన జీవనం నాశనం చేయడంపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జిహెచ్ఎంసి అధికారుల ఈ చర్య తన జీవితాన్ని మొత్తం నాశనం చేసిందని వాపోయారు. మూడు లక్షల రూపాయల పెట్టుబడి పెట్టిన తనకు, ఇప్పుడు కుటుంబ పోషణ ఎలా అనే ప్రశ్న తలెత్తుతుందని అన్నారు.
10వ తరగతి తర్వాత ఒంగోలు నుంచి హైదరాబాద్ వచ్చాడు పీలా గంగాధర్. ఒక ప్రముఖ నటుడి ఇంట్లో సెక్యూరిటీ గార్డుగా ఆయన మొదటి ఉద్యోగం చేశారు. అప్పుడే ఆయన నటుడు కావాలని అనుకున్నారు. ఆపై ప్రయత్నాలు చేస్తూ వెండితెరపై అవకాశాలు తెచ్చుకున్నాడు.
