Tollywood: ‘ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటకు బిత్తరపోయా.. కానీ ఆ క్షణం..’

నటుడు చరణ్ రాజ్ తన కెరీర్‌లో కీలక సంఘటనల గురించి ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. బెంగళూరులో ఎకరం రూ. 500కు భూమి కొన్న విషయం, ఎన్టీఆర్ నుంచి అందిన ప్రత్యేక నంది అవార్డు, ప్రతిఘటన లాంటి చిత్రాలలో తన నటనను గుర్తుచేసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చూసేయండి.

Tollywood: ఆ రోజు ఎన్టీఆర్ చెప్పిన మాటకు బిత్తరపోయా.. కానీ ఆ క్షణం..
Tollywood

Updated on: Jan 31, 2026 | 1:16 PM

ప్రముఖ నటుడు చరణ్ రాజ్ తన కెరీర్‌లోని అనేక అనుభవాలను, వ్యక్తిగత జీవిత విశేషాలను ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. డబ్బు సంపాదించడం కంటే పేరు, మంచి మనసు ముఖ్యమని ఆయన అన్నారు. దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ ఉదాహరణను ప్రస్తావిస్తూ, ఆయన మరణానంతరం స్కూళ్లకు, పేదలకు సాయం చేయడం, అనాధాశ్రమం నడపడం, తన తండ్రి ఆస్తిని ప్రభుత్వానికి ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు వెలుగులోకి వచ్చాయని, ఇది నిజమైన గొప్పతనమని చరణ్ రాజ్ అభిప్రాయపడ్డారు.

తన కెరీర్ మొదట్లో, బెంగళూరులో ఎకరం రూ. 100 నుంచి రూ. 500 చొప్పున భూమిని కొనుగోలు చేశానని, అది ఇప్పుడు రేటు పెరగడం తన జీవితానికి ప్లస్ అయ్యిందని ఆయన తెలిపారు. ఎక్కడా కూడా డబ్బును వృథా చేయకుండా ఆస్తులు చేసుకున్నానని, అవి నేటికీ తనకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. దివంగత నందమూరి తారక రామారావు చేతుల మీదుగా ప్రత్యేక నంది అవార్డు అందుకోవడం తన కెరీర్‌లో అత్యంత గొప్ప క్షణం అని చరణ్ రాజ్ అన్నారు. “ప్రతిఘటన” సినిమాలో ఆయన నటనకు ఎన్టీఆర్ రెండుసార్లు సినిమా చూశారని, అవార్డు వేడుకలో క్లీన్ షేవ్‌తో ఉన్న తనను చూసి “చరణ్ రాజ్ కొడుకా?” అని అడిగారని, ఆ తర్వాత అసలు విషయం తెలిసి “చూడండి ఆర్టిస్ట్ అంటే ఇలా ఉండాలి” అని తనను ప్రశంసించారని చరణ్ రాజ్ గుర్తు చేసుకున్నారు. ఈ సంఘటన తనకు దేవుడిచ్చిన గొప్ప వరమని ఆయన అన్నారు.

“లంకేష్ పత్రిక” వ్యవస్థాపకుడు లంకేష్ తీయాలనుకున్న “తెరెగలు” చిత్రంలో మొదటిగా చరణ్ రాజ్ హీరోగా ఎంపికైనప్పటికీ, ఆ సినిమా జరగలేదు. ఆరు నుంచి ఎనిమిది నెలల పాటు తీవ్ర నిరాశతో వేచి చూశానని చరణ్ రాజ్ తెలిపారు. ఆ తర్వాత సిద్దలింగా “పరాజిత” సినిమా విజయం సాధించడంతో, తొలిసారి విమానంలో తన ఊరు బెళగావి వెళ్ళినప్పుడు, మూడు నాలుగు వేల మంది ప్రజలు తనను ఆహ్వానించడానికి వచ్చారని.. అది చూసి ఆశ్చర్యపోయానని తెలిపారు. ఈ రోజు తాను నటుడు కావడానికి తన స్నేహితుడు గురురాజునే కారణమని ఆయన భావోద్వేగానికి లోనయ్యాడు. గురురాజు ఇప్పుడు బ్యాంకులో ఉద్యోగం చేస్తూ రిటైర్ అయ్యాడని, ఇప్పటికీ తమ స్నేహం కొనసాగుతోందని చెప్పుకొచ్చారు.

హీరోగా, విలన్‌గా రెండు పాత్రలను తాను ఎంజాయ్ చేస్తానని చరణ్ రాజ్ పేర్కొన్నారు. “ప్రతిఘటన”లో తన పాత్రను అందరూ తిట్టినప్పుడు.. తాను ఆ పాత్రకు ప్రాణం పోశానని సంతోషించానని.. “నరకాసురుడు” చిత్రంలో సెబాస్టియన్ పాత్రను కూడా బాగా ఎంజాయ్ చేశానని తెలిపారు. తన పెద్ద కుమారుడు ఇప్పటికే తమిళంలో “90 ఎం.ఎల్” తెలుగులో “నరకాసురుడు” చిత్రాలలో నటించగా, రెండవ కుమారుడు పైలట్‌గా ఉంటూ, కోవిడ్ సమయంలో ఇండస్ట్రీపై ఆసక్తి పెంచుకొని, ఉత్తేజ్ వద్ద యాక్టింగ్ కోర్సు చేసి, ప్రస్తుతం “కుప్పని” అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడని చరణ్ రాజ్ స్పష్టం చేశారు.

ఇది చదవండి:  ఆ డైరెక్టర్ ఐదుగురు అమ్మాయిలతో ఓ రాత్రి గడిపారని చెప్పాడు.. అది విని షాకయ్యా

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..