Shyam Singha Roy: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం శ్యామ్ సింగరాయ్ గా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్న నాని…ఇప్పుడు శ్యామ్ సింగరాయ్ సినిమాతో సాలిడ్ హిట్ కొట్టడానికి రెడీ అవుతున్నాడు. నాని నటించిన గత రెండుస్ సినిమాలు దారుణంగా నిరాశ పరిచిన విషయం తెలిసిందే. మంచి అభిరుచి కలిగిన దర్శకుడిగా పేరుతెచ్చుకున్న ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నాని నటించిన వి సినిమా ఓటీటీ వేదికగా విడుదలైంది. ఈ సినిమాలో సుధీర్ బాబు కూడా నటించారు. యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేక పోయింది. ఆ తర్వాత ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఈ నేచురల్ స్టార్.
వరుస విజయాలతో దూసుకుపోతున్న శివ నిర్వాణ దర్శకత్వంలో టక్ జగదీష్ సినిమా చేశాడు నాని. ఈ సినిమా కూడా ఓటీటీ వేదికగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. ఇక ఇప్పుడు ఈ కుర్ర హీరో ఆశలన్నీ శ్యామ్ సింగరాయ్ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు. ఫిరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి, మడోన్నా సెబాస్టియన్, కృతి శెట్టి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్స్, ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమాను డిసెంబర్ 24న విడుదల చేయనున్నారు. ఇప్పటికే నాని అభిమానులు హడావిడి మొదలు పెట్టేశారు. రెండేళ్ల తర్వాత నాని హీరోగా నటించిన సినిమా థియేటర్లలోకి వస్తుండటంతో అభిమానులు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని దేవి థియేటర్ వద్ద 63 అడుగుల భారీ ‘శ్యామ్ సింగరాయ్’ కటౌట్ ను ఏర్పాటు చేశారు. అలాగే ఈ కటౌట్ పై పూల వర్షం కురిపించారు. టపాసులు పేల్చి హంగామా చేశారు. మరి ఈ సినిమా నాని అభిమానుల అంచనాలను అందుకుంటుందేమో చూడాలి.