ప్రముఖ హాస్యనటుడు కరుణాకరన్ ఇంట్లో 60 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైన ఘటన సంచలనం సృష్టించింది. ఈ ఘటనలో అతని ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషిని అరెస్ట్ చేశారు పోలీసులు. నటుడు కరుణాకరన్ తన కుటుంబంతో చెన్నైలోని ఓఎంఆర్ రోడ్డులో ఉన్న కరపాక్కం ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇటీవల ఆయన ఇంట్లోని బీరువాలో 60 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో షాక్‌కు గురైన కరుణాకరన్ భార్య తేరల్ చెన్నై కన్నగి నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దాని ఆధారంగా కన్నగి నగర్ పోలీసులు కేసు నమోదు చేసి ముమ్మరంగా దర్యాప్తు చేశారు. అలాగే కరుణాకరన్ ఇంటిని తనిఖీ చేయగా నగలు ఉంచిన బీరువా పగలకుండా కనిపించింది. అలాగే ఇంటి తాళం పగలకపోవడంతో బయటి వ్యక్తులు చోరీకి పాల్పడలేదని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
అనంతరం ఇంట్లోని వ్యక్తులు, పని చేసే వారి వేలిముద్రలను పోలీసులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేశారు. ఈ ఘటనలో కరుణాకరన్ ఇంట్లో పనిచేసే కరపాక్కం కాళియమ్మన్ కోవిల్ స్ట్రీట్‌కు చెందిన విజయ అనే మహిళ నగలు అపహరించినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు పనిమనిషి విజయను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.
కరుణాకరన్ తమిళ్ ఇండస్ట్రీలో కమెడియన్ గా అలరిస్తున్నాడు. చిన్న చిన్న సినిమాల నుంచి మొదలు పెట్టి స్టార్ హీరోల సినిమాల వరకు కమెడియన్ గా నటించి మెప్పించాడు కరుణాకరన్. 100కు పైగా తమిళ చిత్రాల్లో హాస్య పాత్రల్లో నటించారు. ఆయన ఇంట్లో చోరీ ఘటన సినీ వర్గాల్లో కలకలం రేపింది. ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం సూపర్ స్టార్ రజినీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లోనూ చోరీ జరిగిన విషయం తెలిసిందే. దాదాపు 100 సవర్ల బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి, 30 గ్రాముల వజ్రాభరణాలు పనిమనుషులే చోరీ చేశారు. అలాగే హీరోయిన్ అతుల్య రవి ఇంట్లో కూడా చోరీ జరిగింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.