రంగనాథ్ పనిమనిషికి ఆస్తిమొత్తం ఎందుకు రాసిచ్చారంటే.. అసలు విషయం చేసిన కొడుకు
సీనియర్ నటుడు రంగనాథ్.. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషించి గుర్తింపు తెచ్చుకున్నారు. సినిమాల్లో ఎంతో అద్భుతమైన పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. ఎంతో అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకున్న రంగనాథ్ ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని అభిమానులు, తెలుగు ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటుడు రంగనాథ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్నో సినిమాల్లో విభిన్నమైన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశారు. హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా ఇలా ఎన్నో పాత్రల్లో నటించి మెప్పించారు. అయితే అద్భుతమైన నటుడిగా పేరు సంపాదించుకున్న రంగనాథ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకోవడం అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమతో పాటు అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన మరణం తర్వాత ఆస్తికి సంబంధించిన విషయాలు, కుటుంబ వివాదాలపై అనేక వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. ముఖ్యంగా తన ఆస్తిని పనిమనిషి పేరు మీద రాసిచ్చారనే ప్రచారం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమధ్య రంగనాథ్ కుమారుడు నాగేంద్ర కుమార్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన తండ్రి మరణం తర్వాత తమ కుటుంబం ఎదుర్కొన్న పరిస్థితులు, పనిమనిషికి ఆస్తి రాసివ్వడం, అప్పట్లో వచ్చిన ఆరోపణలపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
నాగేంద్ర కుమార్ వెల్లడించిన వివరాల ప్రకారం.. మీనాక్షి అనే మహిళ 2003-2004 సమయంలో తమ ఇంట్లో పనికి చేరిందని, దాదాపు ఆరేళ్లపాటు కుటుంబంతో కలిసి ఉందని తెలిపారు. ముఖ్యంగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో మీనాక్షి ఎంతో అంకితభావంతో సేవ చేసిందని గుర్తుచేసుకున్నారు. రాత్రి వేళల్లో సైతం తల్లి అవసరాలను చూసుకుంటూ ఎంతో శ్రద్ధగా వ్యవహరించేదని చెప్పారు. తమ కుటుంబానికి ఆమె చేసిన సేవలను ఎప్పటికీ మర్చిపోలేమని నాగేంద్ర కుమార్ పేర్కొన్నారు. తన తండ్రి రంగనాథ్ మరణానికి ముందు జరిగిన పరిణామాలను కూడా నాగేంద్ర కుమార్ వివరించారు. మీనాక్షి పని మీద బయటకు వెళ్లిన సమయంలోనే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని తెలిపారు. ఆమె ఇంటి నుంచి వెళ్లిన అరగంట నుంచి 45 నిమిషాల వ్యవధిలోనే తన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన తమ కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రంగనాథ్ ఆత్మహత్య చేసుకున్న ప్రదేశంలో కనిపించిన ఓ విషయం గురించి కూడా నాగేంద్ర కుమార్ మాట్లాడారు. తన తండ్రి వంటగదిలో ఉరివేసుకున్నారని, అక్కడ గోడపై ‘డోంట్ డిస్టర్బ్ మీనాక్షి’ అని రాసి ఉందని వెల్లడించారు. మీనాక్షి తమ కుటుంబానికి చేసిన సేవలను గుర్తించి, ఆమె భవిష్యత్తుకు ఆర్థికంగా అండగా నిలవాలనే ఉద్దేశంతోనే తన తండ్రి ఆస్తిని ఆమె పేరు మీద రాసి ఉండవచ్చని నాగేంద్ర కుమార్ అభిప్రాయపడ్డారు. అయితే ఈ విషయాన్ని తన తండ్రి తమతో నేరుగా ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులను ఎంతో ప్రేమగా, బాధ్యతగా చూసుకున్న మీనాక్షి పట్ల నాగేంద్ర కుమార్ తన కృతజ్ఞతను వ్యక్తం చేశారు. ఆమెకు డబ్బులు ఇచ్చి, ఇంటి దగ్గర దించి, ఆమె కాళ్లకు నమస్కరించినట్లు తెలిపారు. తమ కుటుంబం కష్టకాలంలో ఆమె చేసిన సేవలకు ఎప్పటికీ రుణపడి ఉంటామని భావోద్వేగంగా చెప్పారు. రంగనాథ్ మరణం తర్వాత తమ కుటుంబం అనేక విమర్శలు, ఆరోపణలు ఎదుర్కొందని నాగేంద్ర కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఆస్తిని పనిమనిషి పేరు మీద రాయడం, పిల్లలను పట్టించుకోలేదనే అంశాలపై అప్పట్లో ఎన్నో రకాల వార్తలు ప్రచారంలోకి వచ్చాయని తెలిపారు. ప్రెస్, ప్రజల నుంచి తమ కుటుంబం తీవ్ర విమర్శలను ఎదుర్కొందని చెప్పారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




