Sharwanand: పడతాం లేస్తాం… పడతాం లేస్తాం… ఆఖరికి నిలబడతాం.. అనేది సినిమాను నమ్ముకున్నవాళ్లందరూ రొటీన్‌గా చెప్పేమాట. కానీ.. అలా పడిలేచిన కెరటాలకు ఒరిజినల్ కేరాఫ్ మాత్రం అతడొక్కడేనట. నేను విన్నాను నేను ఉన్నాను అని కుర్రహీరోలకు అభయమిస్తున్న ఆ డైరెక్టర్ ఎవరు… ఆయన గురించి ఇండస్ట్రీలో నడుస్తున్న ఇంట్రస్టింగ్ టాక్ ఏంటంటే..మహానుభావుడు అనే సౌండ్ అనిపించుకోడానికీ, వినిపించుకోడానికి బానే వుంటుంది. దాన్ని కలకాలం నిలబెట్టుకోవడమే కష్టం. హీరో శర్వానంద్‌కైతే ఈ విషయం బాగా తెలుసు. హిట్టు కోసం రణరంగంలో దూకాడు, లేటెస్ట్‌గా మహాసముద్రం ఈదాడు అయినా కెరీర్‌ని గాడిలో పెట్టుకోలేక సతమతమౌతున్న శర్వాకి.. కొంతలోకొంతయినా రిలీఫ్ నిచ్చారు డైరెక్టర్ కిశోర్ తిరుమల.
ఆడాళ్లూ మీకు జోహార్లు..శర్వా లేటెస్ట్ మూవీ. శతమానంభవతిలా బిగ్ స్కోర్ చేస్తుందా లేదా అనేది అటుంచితే… చాలా గ్యాప్ తర్వాత తెలుగులో ఒక పర్‌ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ని చూశామన్న భావనైతే ఆడియన్స్‌లో కనిపించిందట. టోటల్‌గా మినిమమ్ గ్యారంటీ హీరో అనే ట్యాగ్‌ని రీగెయిన్ చేసుకున్నారు శర్వా. ఆ మాటకొస్తే… ఇలా కుర్రహీరోలకు భరోసానివ్వడం కెప్టెన్ కిశోర్‌కి కొత్తేమీ కాదు.
కందిరీగ తర్వాత కామ్ అయిపోయిన రామ్ గ్రాఫ్‌ని సడన్‌గా టాప్‌గేర్లోకి తీసుకొచ్చిన క్రెడిట్ కూడా ఈ కిశోర్ తిరుమలదే. అరడజను సినిమాలు ఆవిరైపోయిన తర్వాత కిశోర్‌తో చేసిన నేను-శైలజ, ఉన్నది ఒకటే జిందగీ సినిమాలే రామ్ జిందగీని పూర్తిగా మార్చేశాయి. ఆ వెంటనే మెగా మేనల్లుడు సాయితేజ్‌ని టేకప్ చేశారు కిశోర్ తిరుమల. వీవీ వినాయక్ లాంటి సీనియర్లతో ట్రై చేసినా విన్నర్ అనిపించుకోలేక ఉస్సూరుమంటున్న తేజ్‌కి చిత్రలహరి లాంటి బ్యూటిఫుల్ సినిమానిచ్చి… సుప్రీమ్ హీరో అనే ట్యాగ్‌ని సుస్థిరం చేశారు. టాలీవుడ్‌లో ఓ మంచి కథకుడిగా, డైలాగ్ రైటర్‌గానే కాకుండా, యంగ్ హీరోల పాలిట ఆపద్బాంధవుడిలా కూడా మల్టిపుల్ ఫేసెస్‌తో హ్యాపెనింగ్ డైరెక్టర్ అనిపించుకుంటున్నారు కిశోర్ తిరుమల. ఈ లక్కీ మస్కట్ టార్గెట్ చేసిన నెక్ట్స్ హీరో ఎవరో మరి!