బిగ్ ఆస్ తెలుగు ఏడో సీజన్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట జరిగిన ఘటనలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. టైటిల్ విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అభిమానులు పరస్పరం ఘర్షణ పడడం, ఒకరినొకరు కొట్టుకున్నారు. అలాగే ఆర్జీసీ బస్సులను ధ్వంసం చేశారు. అమర్ దీప్ దంపతులు ప్రయాణిస్తున్న కారుతో పాటు అశ్విని శ్రీ, గీతూ రాయల్‌ల కార్లపై దాడికి తెగ బడ్డారు. దీంతో బిగ్ బాస్ రియాలిటీ షోకు ఎక్కడా లేని నెగెటివిటీ వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా బిగ్ బాస్ షోను రద్దు చేయాలంటూ, మేనేజ్‌మెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ పలువురు ప్రముఖులు కోరుతున్నారు. తాజాగా ఇదే విషయంపై బిగ్ బాస్ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ స్పందించింది. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్‌లో ఐదో ప్లేస్‌లో నిలిచిన ఈ కన్నడ ముద్దుగుమ్మ అమర్ దీప్ దంపతులపై దాడి చేయడం దారుణమని పేర్కొంది. ఓ యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడిన ప్రియాంక జైన్.. ‘ అభిమానుల పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడడం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. తప్పేం లేదు. కానీ ఇలా దాడి చేయడం మాత్రం దారుణం. ఎవరైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాం. కానీ ఇలా కొన్ని సెకన్లలో ధ్వంసం చేయడం ఏ మాత్రం సరికాడు. దాడి సమయంలో కారు లోపల మహిళలు (అమర్ దీప్ భార్య, తల్లి) ఉన్నారనే స్పృహ కూడా లేకుంటే ఎలా’ అని మండిపడింది.
‘బిగ్ బాస్ హౌజ్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో మాకు గొడవలు ఉంటాయి. ఒక్కసారి టాస్క్ ముగియగానే మళ్లీ అందరం కలిసి పోతాం. పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్, శివాజీ, అమర్ దీప్, అర్జున్.. ఇలా హౌస్ లో అందరం కలిసే ఉండే వాళ్లం. మాలో మాకు ఎలాంటి గొడవలు లేవు. ముఖ్యంగా బిగ్ బాస్ చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి అనుబంధం ఏర్పడింది. అతను నిజంగానే భూమి బిడ్డ’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. కాగా బిగ్ బాస్ తర్వాత జరిగిన సంఘటనలకు సంబంధించిన కేసులో పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. 14 రోజుల రిమాండ్ నిమిత్తం అతనిని చంచల్ గూడ జైలుకు తరలించారు. అయితే తాజాగా ఈ కేసులో రైతు బిడ్డకు బెయిల్ మంజూరైంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.