Tollywood: కిడ్నీలు, లివర్ చెడిపోయి దీన స్థితిలో బాలుడు.. గొప్ప మనసు చాటుకున్న తెలుగు యాంకర్.. వీడియో

ప్రముఖ స్పోర్ట్స్ యాంకర్ వింధ్య విశాఖ మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది. గతంలో ఎంతో మందికి ఆపన్న హస్తం అందించిన ఈ అందాల యాంకరమ్మ ఇప్పుడు ఓ 9 ఏళ్ల బాలుడిని కాపాడేందుకు తన వంతు ఆర్థిక సహాయం చేసింది.

Tollywood: కిడ్నీలు, లివర్ చెడిపోయి దీన స్థితిలో బాలుడు.. గొప్ప మనసు చాటుకున్న తెలుగు యాంకర్.. వీడియో
Anchor Vindhya Vishaka

Updated on: Oct 24, 2025 | 8:42 PM

ఒక ప్రముఖ టీవీ ఛానెల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభింది వింధ్య విశాఖ. ఆ తర్వాత పలు టీవీషోలకు యాంకర్ గాకూడా వ్యవహరించింది. ఫ్యామిలీ సర్కస్, హంగామా, సఖీ, మా టీవీలో మా ఊరి వంట, నువ్ రెడీ నేను రెడీ తదితర టీవీ షోస్, కార్యక్రమాలు ఈ విశాఖ అమ్మాయికి మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. ఇదే క్రమంలో ప్రముఖ స్పోర్ట్స్ ఛానెల్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో స్పోర్ట్స్ ప్రజెంటర్ గానూ చేరింది. తద్వారా ఈ ఘనత సాధించిన మొదటి తెలుగు అమ్మాయిగా అరుదైన ఘనత అందుకుంది. ప్రో కబడ్డీ లీగ్, ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక స్పోర్ట్స్ ఈవెంట్లలో తన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంది. వీటి సంగతి పక్కన పెడితే వింధ్యకు మంచి రూపం, అద్భుతమైన గొంతునిచ్చిన దేవుడు మంచి మనసు కూడా ఇచ్చాడు.అందుకే వింధ్య స్వేచ్ఛ వెల్ఫేర్ ఫౌండేషన్ సంస్థను స్థాపించి ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందీ అందాల యాంకరమ్మ. తాజాగా మరోసారి తన గొప్ప మనసును చాటుకుంది వింధ్య. ఊపరితిత్తులు, కాలేయం చెడిపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ నిరేపద బాలుడికి తన వంతు ఆర్థిక సహాయం అందించింది.

సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ మండలంలోని గిరిపల్లి గ్రామానికి చెందిన 9 ఏళ్ల ప్రణీత్ కు జన్యుపరమైన కారణాలతో కిడ్ని, లివర్‌ రెండూ పని చేయడం లేదు. ప్రస్తుతం ఈ పిల్లాడు సికింద్రాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇదే ఆస్పత్రిలో స్పోర్ట్ యాంకర్ వింధ్య తండ్రి కూడా డయాలసిస్ చేయించుకుంటున్నాడు. ఇదే క్రమంలో తన తండ్రి పక్క బెడ్ పక్కనే ఉన్న ప్రణీత్ దీని స్థితిని చూసి వింధ్య చలించిపోయింది. బాలుడి చికిత్స కోసం తన వంతుగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించింది. తాను అందించిన లక్ష రూపాయలు ప్రణీత్ కు ఏ మాత్రం సరిపోవని, అందరూ తలా ఓ చేయి వేసి ఆ పిల్లాడిని కాపాడుకుందామని పిలుపునిచ్చిందీ అందాల యాంకరమ్మ. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో ను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. అనారోగ్యంతో ఉన్న బాలుడి పట్ల వింధ్య చొరవను అందరూ ప్రశంసిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో ఇదిగో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.