మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్‌ఆర్‌ఆర్ (RRR). అలియాభట్, ఒలివియా మోరీస్, శ్రియా శరణ్, అజయ్ దేవ్‌గణ్, సముద్ర ఖని తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ పీరియాడికల్ డ్రామా ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద ఎత్తున థియేటర్లలో సినిమాను విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. కాగా రాజమౌళి (RajaMouli) ఈ సినిమా ప్రకటించినప్పటి నుంచి వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో అల్లూరి, కొమరం భీమ్‌ల చరిత్రన వక్రీకరించారని, సినిమాను నిలిపేయాలంటూ పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అయితే అన్నీ అడ్డంకులు దాటుకుని రిలీజ్‌కు సిద్ధమైన ఈ చిత్రానికి తాజాగా అల్లూరి సౌమ్య మరో ఝలక్ ఇచ్చారు. సినిమాలో అల్లూరి సీతారామరాజు చరిత్రను వక్రీకరించారంటూ, సినిమా ప్రదర్శనలను నిలిపేయాలంటూ హైకోర్టు (High court) లో ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
తాజాగా ఈ పిల్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర, జస్టిస్ అభినంద్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. అనంతరం ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందానికి ఊరటనిచ్చేలా అల్లూరి సౌమ్య పిల్‌ను కొట్టివేస్తున్నట్లు తీర్పు వెలువరించింది. కాగా సినిమాలో అల్లూరి సీతారామరాజును పోలీసుగా చూపి చరిత్రను పూర్తిగా వక్రీకరించారంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. అటు ఆర్ఆర్ఆర్ సినిమా తరపున కూడా న్యాయవాది కోర్టులో తమ వాదన వినిపించారు. అల్లూరి, కొమురం భీంలను దేశభక్తులుగా చూపామని హైకోర్టుకు వివరించారు. అదేవిధంగా ఆర్ఆర్ఆర్ సినిమా కేవలం కల్పిత కథేనని, సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ కూడా వచ్చిందని గుర్తు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం పిల్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. ఈ సినిమాతో అల్లూరి, కొమురం భీంల పేరు ప్రఖ్యాతలకు ఎలాంటి భంగం కలగదని ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. దీంతో ఈనెల 25న సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది.
Also Read: CM Jagan: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నేడు వారి ఖాతాల్లో జగనన్న విద్యా దీవెన నిధులు..
Hyderabad: వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు అందుబాటులోకి రానున్న ఎల్బీనగర్ అండర్‌పాస్, ఫ్లై ఓవర్
Ugadi 2022: ఈనెల 30 నుంచి శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు.. స్పర్శదర్శనంపై కీలక నిర్ణయం తీసుకున్న ఈవో..