మెగాస్టార్ చిరంజీవికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. చిరు కొనుగోలు చేసిన స్థలంలో ఎటువంటి నిర్మాణాలు చేయవద్దంటూ నోటీసులు జారీ చేసింది. జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీలో చిరంజీవి కొనుగోలు చేసిన స్థలంలో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వివాదాస్పదమైన ఆ స్థలం యథాతథంగా కొనసాగాలని జూబ్లీహిల్స్ సొసైటీకి, చిరంజీవికి హైకోర్టు ఆదేశించింది. ప్రజోపయోగం కోసం ఉద్దేశించిన 595 చదరపు గజాల స్థలాన్ని జూబ్లీహిల్స్ సొసైటీ చిరంజీవికి విక్రయించిందంటూ జె.శ్రీకాంత్ బాబు, ఇతరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మార్చి 14న హైకోర్టులో విచారణ జరిగింది.
వివాదాస్పద ఈ భూమిపై గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌ని నియంత్రణ లేకపోవడంతో.. నిబంధనలకు విరుద్ధంగా సొసైటీ ఆ భూమిని విక్రయించారని, అందులో చిరంజీవి నిర్మాణాలు కూడా చేపట్టారని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. వాదనలు విన్న హైకోర్టు కౌంటరు దాఖలు చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ, జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ, చిరంజీవిని ఆదేశించింది. తదుపరి విచారణ ఏప్రిల్ 24కి వాయిదా వేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..