Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు

ఆయన నడక ఒక స్టైల్.. ఆయన మాట ఒక తుపాకీ గుండు.. ఆయన వేసే సిగరెట్ అగ్గిపుల్ల కూడా బాక్సాఫీస్ దగ్గర మంటలు పుట్టిస్తుంది. కేవలం దక్షిణ భారతదేశానికే పరిమితం కాకుండా, జపాన్ నుంచి అమెరికా వరకు కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఏకైక భారతీయ నటుడు ఆయన.

Rajinikanth Biopic: తలైవా బయోపిక్‌పై అదిరిపోయే అప్‌డేట్! గ్లోబల్‌గా సెన్సేషన్ పక్కా అంటున్న కూతురు
Rajinikanth Basha And Jailer

Updated on: Jan 29, 2026 | 11:10 PM

సినీ ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఏడు పదుల వయసులోనూ కుర్ర హీరోలకు పోటీనిస్తూ వందల కోట్ల వసూళ్లు రాబడుతున్నారు. అయితే ఇంతటి శిఖరాగ్ర స్థాయికి చేరుకున్న ఆ మహానటుడి వెనుక ఉన్న కష్టం, అవమానాలు, కన్నీళ్లు ఎంతమందికి తెలుసు? ఒక సాధారణ వ్యక్తి బస్సు కండక్టర్‌గా ప్రయాణం మొదలుపెట్టి, గ్లోబల్ ఐకాన్‌గా ఎలా ఎదిగారో తెలుసుకోవాలని ప్రతి సినిమా అభిమాని కోరుకుంటున్నారు. తాజాగా ఆ సూపర్ స్టార్ బయోపిక్ గురించి ఒక అదిరిపోయే వార్త బయటకు వచ్చింది. ఆయన కుమార్తె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించడంతో సోషల్ మీడియాలో రజనీ నామస్మరణ మారుమోగుతోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ బయోపిక్ గురించి గత కొంతకాలంగా అనేక వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. తాజాగా రజనీకాంత్ పెద్ద కుమార్తె, దర్శకురాలు సౌందర్య రజనీకాంత్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని అభిమానులకు ఒక తీపి కబురు చెప్పారు. తన తండ్రి బయోపిక్ సినిమాకు సంబంధించిన పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని, త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు. “సూపర్ స్టార్ కుమార్తెగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. నా తండ్రి ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. ఈ సినిమా ఎప్పుడు విడుదలైనా గ్లోబల్ స్థాయిలో సంచలనం సృష్టించడం ఖాయం” అని సౌందర్య ఆశాభావం వ్యక్తం చేశారు.

బస్సు కండక్టర్ నుంచి ‘తలైవా’ వరకు..

రజనీకాంత్ జీవితం ఒక సినిమా కథ కంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన ఆయన, మొదట బస్సు కండక్టర్‌గా తన జీవనోపాధిని కొనసాగించారు. అయితే సినిమాలపై ఉన్న మక్కువతో ఆ ఉద్యోగాన్ని వదిలేసి, అవకాశాల కోసం చెన్నైకి చేరుకున్నారు. ప్రారంభంలో ఎన్నో అవమానాలను భరించారు, పరాజయాలను చవిచూశారు. నల్లగా ఉన్నాడని, భాష రాదని వెక్కిరించిన వారే నేడు ఆయనకు నీరాజనాలు పలుకుతున్నారు. దాదాపు ఐదు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగుతూ 170కి పైగా సినిమాలలో నటించి తనదైన ముద్ర వేశారు. ఆయన సినీ ప్రస్థానంలోని ప్రతి అడుగు ఈ బయోపిక్ ద్వారా కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నారు.

ప్రస్తుతం రజనీకాంత్ వయసు 75 ఏళ్లు దాటినప్పటికీ, నవ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. ‘కూలీ’ సినిమా తర్వాత ఆయన ఇప్పుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ‘జైలర్ 2’ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాతో పాటు కమల్ హాసన్ నిర్మాణంలో ‘తలైవర్ 173’ అనే వర్కింగ్ టైటిల్‌తో మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇలా వయసుతో సంబంధం లేకుండా కెరీర్ పరంగా దూసుకుపోతున్న రజనీకాంత్ జీవిత చరిత్ర తెరకెక్కుతుందనే వార్త వినగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక గొప్ప వ్యక్తి జీవిత చరిత్రను వెండితెరపై చూడటం అనేది ఎప్పుడూ ఒక అద్భుతమైన అనుభవం. రజనీకాంత్ లాంటి లెజెండ్ బయోపిక్ కోసం భారతీయ సినిమానే కాదు, ప్రపంచ సినిమా మొత్తం ఎదురుచూస్తోంది.