Scene Movie Review: సీన్ మూవీ రివ్యూ.. అదరగొట్టిన సూర్య.. మైండ్ గేమ్..!
వరుస విజయాలతో జోరు మీదున్న సూర్య.. సీన్ అంటూ ఒకే ఏడాది మూడో సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చేసారు.. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో సూర్య సరసన నజ్రియా నజీమ్ కథానాయికగా నటించింది. ఈ మూవీ ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: సీన్
నటీనటులు: సూర్య, నజ్రియా నజీమ్, నస్లెన్, లాల్, ఆనందరాజ్, సెల్వి తదితరులు
సంగీతం: సుషిన్ శ్యామ్
సినిమాటోగ్రఫీ: వినీత్ అగస్త్యన్
ఎడిటింగ్: అజ్మల్ సబు
నిర్మాతలు: సూర్య, జ్యోతిక
దర్శకుడు: జీతూ మాధవన్
వరుస విజయాలతో జోరు మీదున్న సూర్య.. సీన్ అంటూ ఒకే ఏడాది మూడో సినిమాతో వచ్చేసారు.. మలయాళ దర్శకుడు జీతూ మాధవన్ తెరకెక్కించిన ఈ చిత్రం ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
ప్రేమ్ రాజ్ (సూర్య) నేరాలను ఇట్టే పసిగట్టే షెర్లాక్ హోమ్స్ లాంటి తెలివైన పోలీస్ ఆఫీసర్. కానీ అతనికి ఒక పెద్ద బలహీనత ఉంటుంది. అది ఎవరికీ తెలియకుండా ఉండటానికి తను చేస్తున్న పోలీస్ జాబ్‌కు రిజైన్ లెటర్ పంపిస్తాడు ప్రేమ్ రాజ్. కానీ దాన్ని ఒప్పుకోడు ఆయన సుపీరియర్ (లాల్). మరోవైపు ఈశ్వరన్ (నస్లెన్) చాలా తెలివైన సీరియల్ కిల్లర్, అలాగే డబ్బు కోసం హత్యలు చేసే కాంట్రాక్ట్ కిల్లర్. తనకున్న లోపాన్ని పక్కనపెట్టి, అంతటి ప్రమాదకరమైన హంతకుడిని ఈ పోలీస్ ఆఫీసర్ ఎలా పట్టుకున్నాడు.. దానికోసం మాయ (నజ్రియా నజీమ్) ప్రేమ్ రాజ్‌కు ఎలా సాయం చేసింది.. ఈ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? అసలు ప్రేమ్ రాజ్‌కు ఉన్న లోపమేంటి అనేది ఈ చిత్ర ప్రధానాంశం.
కథనం:
‘రోమాంచం’, ‘ఆవేశం’ లాంటి సినిమాలతో హారర్, గ్యాంగ్‌స్టర్ జానర్లకు కొత్త మలుపులు ఇచ్చిన దర్శకుడు జీతూ మాధవన్.. ఇప్పుడు ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్‌ను ఎంచుకుని అందులో కూడా అద్భుతమైన వినోదాన్ని పండించాడు. సీరియల్ కిల్లర్ కాన్సెప్ట్ అనగానే ‘రాక్షసన్’ లాంటి భయపెట్టే హింసాత్మక దృశ్యాలు ఉంటాయని ఊహిస్తాం. కానీ ఇక్కడ అందుకు పూర్తి భిన్నంగా కామెడీ, మాస్ ఎలిమెంట్స్ జోడించి చాలా కూల్ గా కథను నడిపించాడు. హీరో తన ఇన్వెస్టిగేషన్ కోసం ఎంచుకున్న టీమ్ అంతా ఏదో ఒక లోపం ఉన్నవారే కావడం విశేషం. హీరోయిన్ నజ్రియా ఫహాద్‌కు ఒక మైనస్ ఉన్నప్పటికీ, ఆమె హీరోకి కళ్ళులాగా సహాయపడుతుంది. హీరో తల్లిదండ్రులు కూడా వైకల్యంతో బాధపడుతుంటారు. ఈ విభిన్నమైన పాత్రలతోనే దర్యాప్తు సరదాగా సాగుతుంది. దర్శకుడు భారీ సెట్టింగులకు వెళ్లకుండా, కథలో ఎక్కువ భాగాన్ని హీరో ఇంట్లోనే నడిపించాడు. ఈశ్వరన్ నేరాలు చేసే తీరు కూడా చాలా సాధారణంగా ఉన్నప్పటికీ, అది స్క్రీన్ మీద చాలా ఎఫెక్టివ్ గా వర్కౌట్ అయింది. అయితే సినిమా మొదలైన కాసేపు కథ కాస్త నెమ్మదిగా సాగుతుంది, లాల్ కామెడీ సీన్స్ బాగా పండాయి. కానీ ఎప్పుడైతే హీరో బలహీనత రివీల్ అవుతుందో, అక్కడి నుంచి స్క్రీన్ ప్లే ఊపందుకుంటుంది. ఆ తర్వాత కిల్లర్ కు, పోలీసులకు మధ్య జరిగే క్యాట్ అండ్ మౌస్ గేమ్ ప్రేక్షకులను కుర్చీ అంచున కూర్చోబెడుతుంది. అనవసరమైన హంగామా లేకుండానే, హీరో హీరోయిన్ల ఇద్దరికీ విజిల్స్ వేసే రేంజ్ మాస్ ఎలివేషన్స్ ఇవ్వడం కథనంలో మరో ప్లస్ పాయింట్.
నటీనటులు:
సూర్య ఈ సినిమాలో చాలా రిలాక్స్డ్‌గా కనిపించి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. ఆయన పాత హిట్ సినిమాలు కాక కాక, సింగం, సెవెంత్ సెన్స్, సూర్య సన్నాఫ్ కృష్ణన్ రిఫరెన్సులు అభిమానులను అలరిస్తాయి. కానీ అవి ఎక్కడా అతిగా అనిపించవు. సీరియల్ కిల్లర్ గా నస్లెన్ నటన చాలా కూల్ గా, నేచురల్ గా ఉంది. ఈ కుర్రాడు పూర్తిగా సర్‌ప్రైజింగ్ ప్యాకేజ్. నజ్రియా ఫహాద్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది, ఆమెకు కూడా ఒక అదిరిపోయే మాస్ సీన్ దక్కింది. హీరో తండ్రి పాత్రలో పెదరాయుడు ఫేమ్ ఆనందరాజ్‌తో పాటు మిగతా వారు తమ పరిధి మేర బాగానే నటించారు.
టెక్నికల్ టీం:
సుషిన్ శ్యామ్‌కు ఇది తొలి తమిళ చిత్రం. సీరియల్ కిల్లర్ సినిమాల్లో ఉండే రెగ్యులర్ లౌడ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లా కాకుండా, చాలా ప్రశాంతమైన సంగీతాన్ని అందించాడు. అజ్మల్ సబు ఎడిటింగ్ పర్లేదు.. ఫస్టాఫ్ కాస్త ట్రిమ్ చేయాల్సింది.. వినీత్ అగస్త్యన్ సినిమాటోగ్రఫీ టాప్ నాచ్‌లో ఉంది. జీతూ మాధవన్ దర్శకత్వం ఈ ఏడాది వచ్చిన బెస్ట్ తమిళ్ సినిమాల్లో ఒకటిగా దీనిని నిలబెట్టింది. తక్కువ లొకేషన్స్‌తోనే అద్భుతమైన అవుట్ పుట్ రాబట్టడంలో టెక్నికల్ టీం పనితనం మెచ్చుకోదగినది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా సీన్.. కమర్షియల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సీన్..!
