‘ప్రతి రోజు పండగే’ రివ్యూ

నిర్మాణ సంస్థలు: యు వీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ తారాగణం: సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, విజయ్‌కుమార్‌, రావు రమేష్‌, హరి తేజ, భరత్‌ రెడ్డి తదితరులు దర్శకత్వం: మారుతి నిర్మాత: బన్నీ వాసు సహ నిర్మాత: ఎస్‌.కె.ఎన్‌. సంగీతం: ఎస్‌ తమన్‌ సమర్పణ: అల్లు అరవింద్‌ విడుదల: 20.12.2019 ఫస్ట్ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, పాటలు… అన్నిటినీ బట్టి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథ ఇదీ… అని ఎవరికి నచ్చిన రీతిలో వారు ఊహించుకునే ఉంటారు. అన్ని […]

'ప్రతి రోజు పండగే' రివ్యూ
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 25, 2019 | 4:08 PM

నిర్మాణ సంస్థలు: యు వీ క్రియేషన్స్, జీఏ2 పిక్చర్స్ తారాగణం: సాయిధరమ్‌తేజ్‌, రాశీఖన్నా, సత్యరాజ్‌, విజయ్‌కుమార్‌, రావు రమేష్‌, హరి తేజ, భరత్‌ రెడ్డి తదితరులు దర్శకత్వం: మారుతి నిర్మాత: బన్నీ వాసు సహ నిర్మాత: ఎస్‌.కె.ఎన్‌. సంగీతం: ఎస్‌ తమన్‌ సమర్పణ: అల్లు అరవింద్‌ విడుదల: 20.12.2019

ఫస్ట్ లుక్‌, టీజర్‌, ట్రైలర్‌, పాటలు… అన్నిటినీ బట్టి ‘ప్రతిరోజూ పండగే’ సినిమా కథ ఇదీ… అని ఎవరికి నచ్చిన రీతిలో వారు ఊహించుకునే ఉంటారు. అన్ని ఊహలను దాటుకుని ఈ చిత్రం శుక్రవారం థియేటర్లలోకి వచ్చింది. మరి ప్రేక్షకులు ముందుగానే ఊహించినట్టే ఉందా? ‘అంతకు మించి’ సినిమాలో ఇంకేమైనా ఉందా? ఆలస్యం ఎందుకు? కథలోకి వెళ్దాం…

కథ:

ఊరిలో పేరు ప్రతిష్టలున్న పెద్దాయన రఘురామయ్య (సత్యరాజ్)కు ఊపిరితిత్తుల కేన్సర్‌ ఉన్నట్టు తెలుస్తుంది. విదేశాల్లో ఉన్న ఆయన పిల్లలకు ఆ విషయాన్ని తెలియజేస్తారు. ఐదారువారాలే తండ్రి బతికి ఉంటాడని తెలుసుకున్న పిల్లలు… పెద్దాయన బతికున్న చివరి రెండు వారాలు ఇండియాకు రావాలని ప్లాన్‌ చేసుకుంటారు. అయితే విషయం తెలిసిన వెంటనే రఘురామయ్య మనవడు సాయి (సాయితేజ్‌) ఆ పల్లెటూరికి చేరుకుంటాడు. తన తాతను ఆ పరిస్థితిలో చూసి తల్లడిల్లిపోతాడు. తన తాత ఆఖరి రోజులు పండుగ రోజుల్లా గడవాలని అనుకుంటాడు. అందుకే తన నాన్నతో పాటు ఇద్దరు బాబాయ్‌లను, మేనత్తను ఊరికి రప్పిస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ల ప్రవర్తన ఎలా ఉంది? పెద్దాయన ఎప్పుడు పోతాడా అని చూసిన పిల్లలు… ఉన్నట్టుండి ఆయన మీద ప్రేమ కురిపించడానికి కారణం ఏంటి? సాయి జీవితంలోకి ఏంజెల్‌ ఆర్నాను తెచ్చిందెవరు? ఆమెకున్న టిక్‌టాక్‌ పిచ్చి ఎలాంటిది? సాయి తండ్రి (రావు రమేష్) తన క్లయింట్‌ (మురళీశర్మ)కు ఎలాంటి సందర్భంలో మాట ఇచ్చాడు? ఏం మాట ఇచ్చాడు? ఆ మాట వల్ల అతని జీవితంలో చోటుచేసుకున్న ఇబ్బందికర పరిస్థితులేంటి? ఆ పరిస్థితిలో తన తండ్రిని అతడు అన్న మాటలేంటి? దాని వల్ల పెద్దాయనలో కలిగిన బాధ ఏంటి? మళ్లీ కుటుంబాన్ని కలపడానికి సాయి చేసిన పని ఏంటి? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు

విశ్లేషణ:

పిల్లలు విదేశాల్లో సెటిల్‌ అయితే, పల్లెటూళ్లల్లో పెద్దలు వారి కోసం ఎంతగా ఎదురుచూస్తారు… పండగలు పబ్బాల సమయంలోనే కాదు… కాటికి కాళ్లు చాచిన సమయంలోనూ పిల్లల రాకకోసం, వాళ్లతో సమయం గడపడం కోసం పెద్దలు పడే ఆరాటం ఎలా ఉంటుంది? జీవితంలో ఎన్నో పండుగలు చూసిన పెద్దమనసు.. ఆఖరి క్షణాలను కూడా పండుగలా చూడగలిగితే ఎంత బావుంటుంది? వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ రాసుకున్న కథ ఇది. ఒకరకంగా శతమానం భవతి తరహా చిత్రమే. కాకపోతే అందులో భార్యాభర్తల మధ్య పిల్లల కోసం డ్రామా నడుస్తుంది. ఇక్కడ భార్యను పోగొట్టుకుని, ఏకాకిగా మిగిలిన ఓ పెద్దాయన మనసులోని భావాలతో కథ నడుస్తుంది. అక్కడా కుటుంబాన్ని అర్థం చేసుకునేది మనవడే.

ఇందులోనూ కన్నతండ్రిని, బాబాయ్‌లను, పిన్నిని అర్థం చేసుకునేది మనవడే. కాకపోతే రెండు సినిమాల సన్నివేశాల్లో చాలా వేరియేషన్‌ ఉంది. ప్రతిరోజూ పండగేలో అకేషనల్‌ కామెడీ బావుంది. భద్రాన్ని రావు రమేష్‌ ఇమిటేట్‌ చేసే ఎపిసోడ్‌కి థియేటర్లో పగలబడి నవ్వుతున్నారు. హరితేజ కేరక్టర్‌ నోరు విప్పినప్పుడల్లా నవ్వులు పూశాయి. అక్కడక్కడా అలాంటి కామెడీ సినిమాలో పెద్ద రిలీఫ్‌. కాకపోతే సినిమా ఆద్యంతం ‘చావు’ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. ఏంజెల్‌ ఆర్నా పాత్రలో రాశీఖన్నా బాగా చేసింది. టిక్‌టాక్‌ మోజులో అమ్మాయిలు ఎలా ప్రవర్తిస్తారో ఆమె అచ్చం అలాగే చేసింది. అమాయకపు పల్లెటూరి పడుచుగా తనవంతు బాగా చేసింది. సింక్‌ బ్రదర్స్ ఇద్దరూ బాగానే చేశారు. కాకపోతే సినిమాలో ఏదో చిన్న కాన్‌ఫ్లిక్ట్ ఉండాలని వాళ్ల కేరక్టర్‌ను పెట్టినట్టు అనిపించింది. గోదావరి ఒడ్డున ఫైట్‌ బావుంది. తమన్‌ రీరికార్డింగ్‌ బానే ఉంది. పాటలు ముందు నుంచీ హిట్‌ కావడం కూడా సినిమాకు ప్లస్‌ అయింది. ఓవరాల్‌గా జస్ట్ హాల్‌కి వెళ్లి చిల్‌ కావాలనుకునేవారికి సినిమా నచ్చుతుంది. పెద్దలను నిర్లక్ష్యం చేయొద్దనే విషయాన్ని హీరో ద్వారా మరోసారి చెప్పించారు మేకర్స్.

ప్లస్‌ పాయింట్లు:

– లొకేషన్లు – డైలాగులు -నటీనటుల నటన – రావురమేష్‌, హరితేజ కేరక్టర్‌ – కామెడీ సన్నివేశాలు

మైనస్‌ పాయింట్లు

– రొటీన్‌ కథ – చాలా సినిమాలు గుర్తుకొస్తాయి – ఆద్యంతం చావు ప్రస్తావనతో సాగడం – ఆకట్టుకోని సెకండ్‌ హాఫ్‌

ఫైనల్‌గా…. ప్రతిరోజూ పండగే… బాగానే ఉంది!

– డా. చల్లా భాగ్యలక్ష్మి