Ramayana: Part 1 Review: రామాయణ సినిమా రివ్యూ.. తప్పకుండా తెలుసుకోవాల్సిన విజువల్ వండర్..!
రాముడి కథతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి.. తాజాగా అలా వచ్చిన సినిమానే రామాయణ పార్ట్ 1. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: రామాయణ
నటీనటులు: రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి, రవి దూబె, రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్, అరుణ్ గోవిల్, లారా దత్తా తదితరులు
సినిమాటోగ్రఫీ: పంకజ్ కుమార్, మహేష్ లిమాయే
ఎడిటర్: హుఫేజా లోఖండ్వాలా
సంగీతం: హ్యాన్స్ జిమ్మర్, ఏఆర్ రెహ్మాన్
నిర్మాత: నమిత్ మల్హోత్రా
దర్శకుడు: నితీష్ తివారి
రాముడి కథతో ఇప్పటి వరకు చాలా సినిమాలు వచ్చాయి.. తాజాగా అలా వచ్చిన సినిమానే రామాయణ పార్ట్ 1. నితీష్ తివారి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని యశ్, నమిత్ మల్హోత్రా సంయుక్తంగా నిర్మించారు. మరి ఈ సినిమా ఎలా ఉంది..? ప్రేక్షకులను మెప్పించిందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..
కథ:
రామాయణం అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది రాముడు, సీత, రావణుడు, సీతాపహరణం, హనుమంతుని సాయం. ఎంత కొత్తగా తీసినా ఈ మూలకథను మార్చలేరు కదా అనుకునే వాళ్లకు, నితీష్ తివారి తీసిన రామాయణ ఒక సర్‌ప్రైజ్ ప్యాకేజ్ లాంటిది. ఇన్నాళ్లూ మనం విన్న, చూసిన రామాయణ సినిమాల్లో లేని చాలా కొత్త కోణాలను, తెలియని ఎపిసోడ్స్ ను ఈ సినిమాలో డీటైల్డ్‌గా చూపించారు. ఈ సినిమా రాముడి జననంతో కాకుండా రావణుడి (యశ్) పరిచయంతో మొదలవ్వడం దీనిలో ఉన్న అతిపెద్ద కొత్తదనం. అసలు రావణుడు ఎవరు, ఆయన నేపథ్యం ఏంటి, ఆయన ఎందుకంత అహంకారంగా మారాడు అనే విషయాలను ఎంతో క్లియర్‌గా చూపించారు. అయోధ్య రాజ్యానికి కాబోయే రాజు, ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడి (రణ్‌బీర్ కపూర్) బాల్యం, ఆయన ఎదుర్కొన్న కష్టాలతో ఈ కథ ముందుకు వెళ్తుంది. విశ్వామిత్ర మహర్షి మార్గదర్శకత్వంలో అస్త్రశస్త్రాలు నేర్చుకున్న రాముడు.. క్రూరమైన తాటకి అనే రాక్షసిని సంహరించి తన వీరత్వాన్ని నిరూపించుకుంటాడు. ఆ తర్వాత మిథిలా నగరానికి వెళ్లిన రాముడు.. అక్కడ జరిగిన సీతా స్వయంవరంలో శివధనస్సును అవలీలగా ఎక్కుపెట్టి సీతాదేవి (సాయి పల్లవి)ని వివాహం చేసుకుంటాడు. అయితే రాముడు రాజు కావాల్సిన సమయంలో ఊహించని మలుపు చోటు చేసుకుంటుంది. రాముడి సవతి తల్లి కైకేయి (లారా దత్తా) గతంలో తను పొందిన వరాలను ఉపయోగించి.. రాముడికి దక్కాల్సిన రాజ్యాన్ని దూరం చేయడమే కాకుండా 14 ఏళ్ళ పాటు అరణ్యవాసానికి పంపిస్తుంది. తండ్రి మాట నిలబెట్టడం కోసం, ధర్మం కోసం రాజ్యాన్ని వదిలేసిన రాముడు.. తన భార్య సీతాదేవి, ప్రాణ సమానుడైన తమ్ముడు లక్ష్మణుడి (రవి దూబే)తో కలిసి ప్రమాదకరమైన దండకారణ్యానికి వెళ్తాడు. అడవిలో ఎంతో సాధారణంగా సాగుతున్న వీళ్ల జీవితాలను లంకాధిపతి అయిన రావణాసురుడు చిన్నాభిన్నం చేస్తాడు. మారీచుడు అనే రాక్షసుడిని మాయలేడి రూపంలో పంపి, పకడ్బందీ ప్లాన్‌తో సీతమ్మను అపహరిస్తాడు. సీతమ్మకు దూరమైన రామలక్ష్మణులు ఆమెను వెతికేందుకు మొదలుపెట్టిన కష్టమైన ప్రయాణం, అలాగే భవిష్యత్తులో జరగబోయే అతిపెద్ద రామరావణ యుద్ధానికి పునాది పడటంతో ఈ మొదటి భాగం ముగుస్తుంది.
కథనం:
దర్శకుడు నితీష్ తివారి రామాయణ చిత్రాన్ని కేవలం మన కోసమే కాకుండా, ప్రపంచ స్థాయిలో అందరికీ అర్థమయ్యేలా ఒక గ్లోబల్ ప్రాజెక్ట్‌గా డిజైన్ చేశాడు. వాల్మీకి రాసిన మూల కథను తీసుకుని, దానిలోని ప్రతి చిన్న విషయాన్ని చాలా వివరంగా, సులభంగా కనెక్ట్ అయ్యే రీతిలో స్క్రీన్ మీద ప్రెజెంట్ చేశాడు. రామాయణాన్ని కేవలం ఒక పాత పురాణంగా కాకుండా, ధర్మానికి అధర్మానికి, జాలికి అహంకారానికి మధ్య జరిగే ఒక మహా యుద్ధంగా మార్చి చూపించిన విధానం కట్టిపడేస్తుంది. ఫస్ట్ హాఫ్ అంతా పాత్రల పరిచయం, వాటి నేపథ్యాలను ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా సమయం తీసుకున్నాడు. ముఖ్యంగా వేరే దేశాల ప్రేక్షకులకు సైతం ఈ ఇతిహాసం సులభంగా అర్థం కావాలనే ఉద్దేశ్యంతో ప్రతీ పాయింట్‌ను చాలా క్లియర్‌గా వివరిస్తూ కథను నడిపించాడు. స్క్రీన్ ప్లేలో రాముడు, రావణుడి పాత్రలను పూర్తిగా రెండు భిన్నమైన కోణాలుగా చూపించిన తీరు అద్భుతంగా కుదిరింది. ఒకవైపు అత్యంత ప్రశాంతంగా, ధర్మం తప్పకుండా ఉండే రాముడి క్యారెక్టరైజేషన్, మరోవైపు ప్రపంచాన్ని శాసించాలనే కసితో, కోపంతో రగిలిపోయే రావణుడి అగ్రెసివ్ నేచర్.. ఈ రెండింటి మధ్య కథను బ్యాలెన్స్ చేస్తూ దర్శకుడు అల్లుకున్న సన్నివేశాలు బాగున్నాయి.
గాల్లో ఎగిరే ఏనుగులు, పరిగెత్తే ఖడ్గమృగాలు, రూపాలు మార్చుకునే రాక్షసులు లాంటి ఎలిమెంట్స్‌తో అడుగడుగునా ప్రేక్షకులను ఒక మాయా ప్రపంచంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. సీతాపహరణం తర్వాత వచ్చే ఎపిసోడ్స్, హనుమంతుడి ఎంట్రీకి ముందు జరిగే పరిణామాల వరకు మొదటి భాగాన్ని చాలా ఉత్కంఠభరితంగా డిజైన్ చేశాడు. అయితే కథనంలో ఇన్ని పాజిటివ్స్ ఉన్నప్పటికీ కొన్ని నెగెటివ్స్ కూడా స్పష్టంగా కనిపిస్తాయి. సినిమా మొత్తం అబ్బురపరిచే గ్రాఫిక్స్, భారీ విజువల్స్ చుట్టూ తిరగడం వల్ల, రామాయణంలో ఉండాల్సిన అసలైన ఎమోషన్ కొన్ని చోట్ల మిస్ అయిన ఫీలింగ్ వస్తుంది. టెక్నికల్‌గా సినిమాను ఎంత రిచ్‌గా చూపించాలో అన్న ఆరాటంలో, పాత్రల మధ్య ఉండాల్సిన భావోద్వేగాలను దర్శకుడు కాస్త పక్కన పెట్టినట్లు అనిపిస్తుంది. స్టోరీ అంతా ఒక స్మూత్ ఫ్లోలో కాకుండా, కేవలం కొన్ని భారీ ఎపిసోడ్స్‌ను ఒకదాని తర్వాత ఒకటిగా అతికించినట్లు సాగుతుంది. పైపైన చూస్తే కథనం చాలా గ్రాండ్‌గా, పవర్ ఫుల్‌గా కనిపిస్తుంది కానీ, లోతుగా ఆలోచిస్తే మాత్రం ఆ క్యారెక్టర్స్‌తో మనం ఎమోషనల్‌గా పూర్తి స్థాయిలో కనెక్ట్ అవ్వలేము. అయినప్పటికీ ఈ జనరేషన్‌కి తగ్గట్లుగా ఒక ఎపిక్ స్టోరీని ఇంత భారీ స్థాయిలో వెండితెరపై ఆవిష్కరించిన విధానం మాత్రం మెచ్చుకోదగినదే. అసలైన రామాయణ కథను తెలుసుకోడానికి మాత్రం ఈ చిత్రం చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇదే రామాయణం అంటూ చాలా మంది తీసిన పైపై రామాయణాల కంటే ఇది చాలా లోతుగా, విశ్లేషణాత్మకంగా ఉంది.
నటీనటులు:
ఈ సినిమాలో నటీనటుల ఎంపిక చాలా అద్భుతంగా కుదిరింది. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ చాలా సెటిల్డ్ అండ్ ప్రశాంతమైన నటనతో మెప్పించాడు. రాముడికి కావాల్సిన ఆ పవిత్రత, గాంభీర్యం అతని కళ్లలో స్పష్టంగా కనిపించాయి. ఇక సీతమ్మ పాత్రలో సాయి పల్లవి తన నేచురల్ యాక్టింగ్‌తో ఆ పాత్రకు ప్రాణం పోసింది. లక్ష్మణుడి క్యారెక్టర్‌లో రవి దూబే నటన కూడా సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రావణుడి పాత్రలో నటించిన యశ్ గురించి. యశ్ స్క్రీన్ మీద కనిపించిన ప్రతిసారీ తన పవర్ ఫుల్ యాక్టింగ్ తో సినిమాను మరో లెవెల్ కి తీసుకెళ్లాడు. రావణుడిలో ఉండే ఆ అహంకారాన్ని, భీకరమైన ఆకారాన్ని యశ్ అద్భుతంగా పండించాడు. విద్యుత్ జిహ్వ పాత్రలో వివేక్ ఒబెరాయ్ తదితరులు తమ పాత్రల పరిధి మేర బాగా నటించారు. రకుల్, కాజల్, శోభన, అరుణ్ గోవిల్, లారా దత్తా లాంటి పాత్రలు కథతో పాటే నడిచాయి..
టెక్నికల్ టీం:
ఇది ఏకంగా 4 వేల కోట్ల బడ్జెట్ తో రూపొందిన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కావడంతో సాంకేతిక విలువలు అదే స్థాయిలో కోరుకుంటారు ప్రేక్షకులు. ఏఆర్ రెహ్మాన్, హాన్స్ జిమ్మెర్ అందించిన సంగీతం ఓకే అనిపిస్తుంది, కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇంకాస్త పవర్ ఫుల్ గా ఉంటే బాగుండేది. పంకజ్ కుమార్, మహేష్ లిమాయేల సినిమాటోగ్రఫీ సినిమాకు బిగ్గెస్ట్ అసెట్. ప్రతి ఫ్రేమ్ చాలా బాగా కుదిరింది. విజువల్ ఎఫెక్ట్స్ చాలా వరకు బాగున్నప్పటికీ, ఇంకాస్త బెటర్‌గా ఉంటే సినిమా స్థాయి మరింత పెరిగేది. ఈ సినిమా కోసం దర్శకుడు నితీష్ తివారి చేసిన రీసెర్చ్, ఆయన విజన్ ప్రతి సీన్‌లో కనిపిస్తుంది.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా రామాయణ.. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన సరికొత్త రామరావణ సంగ్రామం..
