Pawan Kalyan: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్‌డే సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సాధారణ ప్రజలు మొదలు, సినీ, రాజకీయ ప్రముఖుల వరకు అందరూ పవన్‌కు విషెస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆయన అభిమానుల హంగామా గురించి అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఊరు వాడా ప్రతీ చోటా పవన్ బర్త్ డే వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ మేరకు తమ అభిమాన హీరో, నాయకుడు పవన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
కాగా, తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఎనలేని ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ప్రతీ ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ‘‘నా చుట్టూ ఉన్న సమాజం ఎల్లవేళలా క్షేమంగా ఉండాలనే భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటాను. యేడాదిన్నర కాలంగా దేశం కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఉంది. సెకండ్ వేవ్ ప్రభావం నుంచి ఇప్పుడిప్పుడే కుదుటపడుతుంది. కష్ట జీవుల జీవనం ఇంకా గాడినపడలేదు. ఇలాంటి క్లిష్ట సమయంలో జన్మదిన శుభాకాంక్షలు అందుకోలేను అనే ఉద్దేశంతో దైవ చింతనలో గడిపాను. సహజంగానే నేను పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటానని నన్ను అభిమానించేవారికి తెలుసు.’’
‘‘నాపై ఉన్న అపార ప్రేమాభిమానాలతో ఎందరో హితైషులు, సన్మిత్రులు, శ్రేయోభిలాషులు, సమాజ సేవకులు, రాజకీయ నేతలు, సినీ తారలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, మీడియా ప్రతినిధులు, ప్రవాస భారతీయులు, నన్ను తమలో ఒకడిగా భావించే అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు సామాజిక మాధ్యమాల ద్వారా శుభాకాంక్షలు అందచేశారు. జనసేన శ్రేణులు, అభిమానులు సామాజిక సేవ కార్యక్రమాలు చేపట్టి తమ అభిమానాన్ని సేవామార్గంలో వెల్లడించారు. పెద్దలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు శుభాశీస్సులు అందించారు. ప్రతి ఒక్కరూ ఎంతో వాత్సల్యంతో నాకు శుభాకాంక్షలు అందించారు. వెల కట్టలేని ఈ అభిమానానికి, వాత్సల్యానికి నేను సర్వదా కృతజ్ఞుడిని. అందరికీ పేరుపేరునా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Also read:
Viral Video: తెగని కత్తెర.. నోటితో రిబ్బన్ కట్ చేసిన మంత్రివర్యులు.. వీడియో చూస్తే నవ్వులే నవ్వులు..
M. K. Stalin: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని సతీసమేతంగా కలిసిన తమిళ్ సీఎం స్టాలిన్..