PM Modi: మన్‌ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు.. నాగార్జున రియాక్షన్ ఇదే..

|

Dec 29, 2024 | 9:01 PM

మన్‌కీబాత్‌ కార్యక్రమంలో దివంగత అక్కినేని నాగేశ్వరరావు సినీ ఇండస్ట్రీకి చేసిన సేవలను కొనియాడారు ప్రధాని మోదీ. భారతీయ సాంప్రదాయాన్ని తన సినిమాల్లో చూపించారని ప్రశంసించారు. భారత రాజ్యాంగం వల్లే తాను ప్రధాని పదవిలో ఉన్నట్టు చెప్పారు. కాగా.. ఏఎన్ఆర్ ను ప్రశంసించడంపై నాగార్జున స్పందించారు. ఏఎన్నార్‌ శత జయంతి సందర్భంగా గౌరవించడం ఆనందకరమంటూ పేర్కొన్నారు.

PM Modi: మన్‌ కీ బాత్‌లో అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు.. నాగార్జున రియాక్షన్ ఇదే..
PM Modi Remembers Akkineni Nageswara Rao
Follow us on

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది చివరి ‘మన్ కీ బాత్‌ కార్యక్రమంలో తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రశంసల జల్లులు కురిపించారు. తెలుగు సినిమాకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. తన సినిమాలలో భారతీయ సంప్రదాయాలు, విలువలకు తగిన స్థానం కల్పించి టాలీవుడ్ ను మరో స్థాయికి తీసుకెళ్లారని ప్రశంసించారు. మానవతా విలువలను కూడా ఆయన చాటారని అన్నారు. టాలీవుడ్‌కు ANR ఎంతో సేవ చేశారని.. ఆయన సేవలు ఎప్పటికీ గుర్తు ఉంటాయని తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని అన్నారు. రాజ్ కపూర్, మహ్మద్ రఫీ, అక్కినేని నాగేశ్వరరావు, తపన్ సిన్హాల సేవలను మోదీ స్మరించుకున్నారు.

భారత్‌ నుంచి అద్భుతమైన సినిమాలు వస్తున్నాయని, ప్రపంచవ్యాప్తంగా మన సినిమాలు రికార్డులను సృష్టించడంతో పాటు అవార్డులు దక్కించుకుంటున్నాయని అన్నారు. వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్‌ను తొలిసారిగా మన దేశంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో మీడియా, వినోద పరిశ్రమకు చెందిన ప్రపంచ దేశాల దిగ్గజాలు పాల్గొంటారని మోదీ పేర్కొన్నారు.

ప్రధాని తన ప్రసంగంలో తెలుగుతో సహా పలు భాషలకు చెందిన సినీరంగ ప్రముఖుల పేర్లను ప్రస్తావించారు. బాలీవుడ్ దర్శకుడు తపన్ సిన్హా సినిమాలు సమాజానికి కొత్త బాటలు వేశాయని పేర్కొన్నారు. రాజ్ కపూర్ తన సినిమాల ద్వారా భారతదేశంలోని సున్నితమైన అంశాలను ప్రపంచానికి పరిచయం చేశారని కొనియాడారు.

భారత రాజ్యాంగం వల్లే తాను ప్రధాని స్థాయికి చేరుకున్నట్టు ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలిపారు. భారత రాజ్యాంగం ప్రపంచానికి ఆదర్శమన్నారు మోదీ. జనవరి 13 నుంచి ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమయ్యే కుంభమేళాను ఐక్యతా మేళాగా పేర్కొన్నారు మోదీ..

నాగార్జున ఏమన్నారంటే..

తెలుగు చలనచిత్ర దిగ్గజం అక్కినేని నాగేశ్వరరావుపై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించడంపై ఆయన కుమారుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ‘‘ఐకానిక్‌ లెజెండ్స్‌తోపాటు మా నాన్న ఏఎన్నార్‌ గారిని ఆయన శత జయంతి సందర్భంగా మీరు గౌరవించడం ఆనందకరం. ఏఎన్నార్‌ దూరదృష్టి, ఇండియన్‌ సినిమాకి ఆయన చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తి’’ అని నాగార్జున పేర్కొన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.