ఎన్నికలకు ముందే రిలీజ్ చేయాలనీ భావించిన ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో రిలీజ్ చేయడం కుదర్లేదు. ఎన్నికల తరుణంలోనే విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ఎన్నో ప్రయత్నాలు చేసినా.. వీలు పడలేదు. అయితే ఎట్టికేలకు ఎలక్షన్ రిజల్ట్ తేలిపోవడం..అధికారంలోకి మళ్ళీ మోదీనే రావడంతో ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ‘పీఎం నరేంద్రమోదీ’ బయోపిక్ విడుదలైంది.
ఎవరూ ఊహించని విధంగా దేశ ప్రజలందరూ మోదీ నేతృత్వంలో ఎన్డీఏకు భారీ ఆధిక్యం తీసుకువచ్చారు. దేశమంతా నరేంద్ర మోదీ హవా ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఇక ఇలాంటి తరుణంలో ఇవాళ రిలీజైన మోదీ బయోపిక్ సినిమా కలెక్షన్స్ వర్షం కురిపిస్తుందని చిత్ర బృందం ఆశిస్తోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు భారీగా పెంచేసింది.
చాయ్ వాలా నుంచి భారత ప్రధానిగా మోదీ జీవిత పయనం ఎలా సాగిందో ఈ సినిమా నేపధ్యం. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సందీప్ సింగ్ నిర్మిస్తున్నారు. ఇక ఈసీ బెంగ లేకుండా రిలీజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుందో లేదో వేచి చూడాలి.