పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అందులో క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చారిత్రాత్మక చిత్రం ఒకటి. పవన్ 27వ చిత్రంగా ఈ మూవీ తెరకెక్కుతుండగా.. తెలంగాణ రాబిన్ హుడ్‌గా పేరొందిన పండుగల సాయన్న బయోపిక్‌గా ఈ చిత్రం తెరకెక్కబోతున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీని ప్రముఖ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. అప్పుడెప్పుడో రత్నం దగ్గర అడ్వాన్స్‌ను తీసుకోగా.. ఈ సినిమాతో ఆయన బాకీని తీరుస్తున్నారు పవన్.
అయితే గత కొన్నేళ్లుగా ఏఎమ్ రత్నంకు గడ్డుకాలం నడుస్తోంది. ఆయన నిర్మించిన చాలా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌లుగా నిలిచాయి. దీంతో ఆర్థికంగానూ రత్నం కాస్త ఇబ్బందుల్లో ఉన్నారు. మరోవైపు క్రిష్ చిత్రానికి పవన్ రెమ్యునరేషన్‌తో కాకుండా దాదాపు వంద కోట్లు ఖర్చు అవుతుందట. ఈ నేపథ్యంలో పవన్‌ను కలిసిన ఏఎమ్ రత్నం, రెమ్యునరేషన్ ఇవ్వలేనని.. లాభాల్లో షేర్ తీసుకోవాలని కోరారట. దానికి ఏ మాత్రం ఆలోచించని పవన్ వెంటనే ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అయితే లాభాలు సినిమా విడుదలయ్యాక వస్తాయి కాబట్టి.. అప్పటివరకు ఈ మూవీ కోసం పవన్ ఒక్క రూపాయి కూడా తీసుకోనట్లే. ఇక మిగిలిన ప్రాజెక్ట్‌ల్లో ఒక్కో సినిమాకు పవన్ దాదాపు రూ.50కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
కాగా ఈ ప్రాజెక్ట్ పాన్ ఇండియా మూవీగా రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేసి.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో విడుదల చేయాలని క్రిష్ ప్లాన్ చేస్తున్నాడట. అంతేకాదు ఈ మూవీకి విరూపాక్షి అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు సమాచారం. మరి ఇందులో నిజమెంత..? పవన్ 27వ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారు..? ఈ మూవీని ఎప్పుడు విడుదల చేయబోతున్నారు..? ఈ ప్రశ్నలన్నింటికి సమాధానం కావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.