అమరావతి, జనవరి 26: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె భవతారిణి క్యాన్సర్‌తో గురువారం (జనవరి 25) కన్నుమూశారు. భవతారిణి మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇళయరాజా కుమార్తె భవతారిణి హఠాన్మరణం బాధాకరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. భవతారిణి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. గాయనిగా, స్వరకర్తగా తనకంటూ ఓ గుర్తింపు సాధించిన భవతారిణి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయని పురస్కారాన్నీ అందుకున్నారు. ఇంకా ఎన్నో సాధించాల్సిన తరుణంలో భవతారిణి కన్నుమూయడం దురదృష్టకరం అన్నారు. ఆమె కుటుంబానికీ, ఇళయరాజా కుటుంబానికీ నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు. భవతారిణి అంత్యక్రియలను శనివారం చెన్నైలో నిర్వహించనున్నారని సమాచారం.
ఇతర సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా తమ ప్రగాఢ సహానుభూతిని తెలిపారు. తమిళనాట STRగా పేరుగాంచిన తమిళ నటుడు సిలంబరసన్ ట్విట్టర్ ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. భవతారినఙ పాడిన మానాడు చిత్రంలోని ఒక పాట క్లిప్పింగ్‌ను హీరో శింబు తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశారు. తమిళ నటుడు ప్రసన్న, గాయని చిన్మయితోపాటు పలువురు సంతాపం తెలిపారు. ఈ క్రమంలో #Bhavatharini #RIP అనే హ్యాష్ ట్యాగ్‌లు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.
కాగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కుమార్తె భవతారిణి (47) గురువారం శ్రీలంకలో కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న భవతారిణి శ్రీలంకలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటూ తుదిశ్వాస విడిచారు. 1995లో ప్రభుదేవా నటించిన రసయ్య అనే తమిళ చిత్రంలో ‘పెప్పి మస్తానా.. మస్తానా..’ అనే పాట ద్వారా గాయనిగా కెరీర్ ప్రారంభించిన భవతారిణి వందలాది పాటలు పాడారు. ఆమె సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా కూడా తండ్రి వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. భవతారిణి సంగీత దర్శకురాలిగా, గాయనిగా మంచి పేరు తెచ్చుకున్నారు. తమిళ, తెలుగు, మళయాళం, కన్నడ, హిందీ భాషా చిత్రాలలో ఆమె ఎన్నో పాటలు పాడారు. ఆమె భర్త ప్రముఖ వ్యాపారవేత్త శబరిరాజ్. తెలుగులో గుండెల్లో గోదారి సినిమాలో ఆమె పాడిన ‘నను నీతో నిను నాతో కలిపింది గోదారి’ పాట సంగీత ప్రియులను ఎంతగా అలరించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఫ్రెండ్స్, పా, టైమ్, ఒరు నాళ్ ఒరు కనవు, అనెగన్ చిత్రాల్లో ఆమె పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఫిర్ మిలెంగే, ఇలక్కనమ్, వెల్లాచి తదితర చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించారు. భారతి మువీ లోని ‘మయిల్ పోలా పొన్ను పొన్ను ఒన్ను’ పాటకుగాను భవతారిణి ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు దక్కించుకున్నారు. ఆమె తండ్రి, సోదరులు సంగీత దర్శకత్వం వహించిన చిత్రాల్లోనే ఆమె ఎక్కువ పాటలు పాడారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.