Paruchuri: కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కిన సినిమా ‘ఆచార్య’. నక్సలిజం నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించిన విషయం తెలిసిందే. అపజయం ఎరగని కొరటాల దర్శకత్వం వహించడం, చిరు, చెర్రీలు కలిసి నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అయితే విడుదల తర్వాత ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని మాత్రం అందుకోలేదనే చెప్పాలి. భారీ అంచనాలతో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ ముందు పెద్దగా ప్రభావం చూపలేదు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన పరుచూరి గోపాల కృష్ణ తన యూట్యూబ్ చానల్ ద్వారా అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆచార్య సినిమాగా చూస్తే ఇందులో తప్పు ఏమీ కనిపించలేదు. కానీ కథలో ముఖ్యమైన సంఘటన.. ఎందుకు జరిగింది? ఏం జరిగింది? అనేది చెప్పకుండా కథను నడిపించిన తీరు ప్రేక్షకుడిని అయోమయంలో పడేసింది. సస్పెన్స్, సెంటిమెంట్ ఒకే చోట ఇమడవు. రామ్‌చరణ్ పోషించిన సిద్ధ పాత్ర ఫస్టాప్‌లోనే వచ్చుంటే బాగుండేది. ఆ పాత్రను మొత్తంగా కాకపోయినా కొంతైనా అక్కడ చూపించి ఉండుంటే ఇంకోలా ఉండేది. డైలాగ్‌లు, కథాంశం, పెర్ఫార్మెన్స్‌లు బాగున్నాయి. ఇప్పటి కాలమాన పరిస్థితుల్లో కమ్యూనిజం భావజాలం ఉన్న సినిమాలు ప్రేక్షకులకు అంతగా నప్పడం లేదు’ అని చెప్పుకొచ్చారు.
ఇక రామ్‌చరణ్‌తో ‘సిద్ధ’ పాత్ర చేయించకుండా ఉంటేనే బాగుండేదేమో అని పరుచూరి అభిప్రాయపడ్డారు. ఫ్లాష్ బ్యాక్ కేవలం 10 శాతమే ఉంచి, చిరు స్టోరీ 90 శాతం ఉండుంటే ఈ కథ ఫలితం మరోలా ఉండేది. సంగీతం సరిగ్గా కుదరలేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉన్న పాత్రలో చిరు స్టెప్పులు వేయకుండా ఉంటే బాగుండేది. ఈ చిత్రానికి ‘ఆచార్య’ టైటిల్ కరెక్ట్ కాదు అనిపించింది’’ అని పరిచూరి గోపాలకృష్ణ తన అభిప్రాయాలను పంచుకున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..