షూటింగ్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ ఇంకా సినిమా రంగం పూర్తిగా తమ పనిని ప్రారంభించడం లేదు. రోజురోజుకు పెరుగుతున్న కేసులు నేపథ్యంలో చాలా మంది స్టార్లు షూటింగ్‌లకు దూరంగా ఉంటున్నారు. దీంతో సినీ కార్మికుల కష్టాలు కొనసాగుతున్నాయి. పని లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు కొనసాగుతుండగా.. వారికి సాయం చేసేందుకు సీసీసీ(కరోనా క్రైసిస్ ఛారిటీ) మరో అడుగు ముందుకేసింది. ఈ మేరకు సీసీసీ సభ్యులతో చర్చలు జరిపారు మెగాస్టార్ చిరంజీవి. అందులో తాము తీసుకున్న నిర్ణయాలను ఆయన వెల్లడించారు
నిత్యావసర వస్తువులను తిరిగి పంపిణీ చేయాల్సిన పరిస్థితులున్నాయి. షూటింగులు మొదలుకాలేదు. ఎవరికీ పనిలేదు. లాక్‌డౌన్ పరిస్థితులే కొనసాగుతున్నాయి. అందుకే అందరికీ నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీసీసీ కమిటీలో నిర్ణయించాం. గతసారి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఎవరూ బయటకు రాలేదు కాబట్టి, సీసీసీ వాలంటీర్ల ద్వారా ఇళ్లకే వస్తువులను పంపిణీ చేశాం. అందువల్ల కాస్త జాప్యం జరిగింది. కానీ ఈసారి ఆయా సంస్థల కార్యాలయాలకు వస్తువులను చేరవేశాం. ఆయా అసోసియేషన్లు చెప్పిన సమయానికి వెళ్లి తీసుకోండి. అసోసియేషన్లు ఇచ్చిన లిస్టు ప్రకారం వస్తువులు అందజేశాం. ఏ ఒక్కరూ మాకు అందలేదు అనే మాట రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆయా అసోసియేషన్ల నాయకులదే. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. నేను స్వయంగా టెస్ట్ చేశాను. టేస్ట్ చేశాను. అందరూ పొదుపుగా వాడుకోండి. మళ్లీ పనులు ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానాన్ని త్వరలోనే వింటాం. నాక్కూడా పని లేక విసుగ్గా ఉంది. బోర్ కొడుతోంది. అందరి పరిస్థితిని అర్థం చేసుకోగలను. త్వరలో కరోనా మహమ్మారిని దాటుదాం. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకోండి. పని ముఖ్యమే. ప్రాణం అంతకన్నా ముఖ్యం. పెద్దలను, చిన్న పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. ఎవరూ అధైర్యపడవద్దు. రోజులు ఎప్పుడూ ఇలాగే ఉండవు. మళ్లీ అందరం చేతినిండా పనితో ఉంటాం. ఎప్పుడూ సీసీసీ కార్మికులకు అండగా ఉంటుంది” అని పేర్కొన్నారు.
Read This Story Also: సుశాంత్ ఫొటోనే చూస్తూ.. కుక్క నిరీక్షణ.. మనసును కదలిస్తోన్న ఫొటోలు, వీడియోలు