Unstoppable with NBK: అన్‌స్టాపబుల్‌లో ఏపీ క్యాపిటల్‌ హీట్‌.. మూడు రాజధానులపై మాజీ సీఎం, స్పీకర్ల సంచలన వ్యాఖ్యలు

|

Nov 22, 2022 | 10:02 PM

మొదటి సీజన్‌లో కేవలం సినిమా సెలబ్రిటీలనే ఆహ్వానించిన ఆహా నిర్వాహకులు రెండో సీజన్‌కు మాత్రం కాస్త పొలిటికల్‌ టచ్‌ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అతిథిగా ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

Unstoppable with NBK: అన్‌స్టాపబుల్‌లో ఏపీ క్యాపిటల్‌ హీట్‌.. మూడు రాజధానులపై మాజీ సీఎం, స్పీకర్ల సంచలన వ్యాఖ్యలు
Unstoppable With Nbk
Follow us on

నందమూరి నట సింహం బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న సెలబ్రిటీ టాక్‌షో అన్‌స్టాపబుల్‌. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఆహా వేదికగా ప్రసారమవుతోన్న ఈ ఛాట్‌షోకు అపూర్వ ఆదరణ దక్కుతోంది. ఇప్పటికే మొదటి సీజన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్‌లోనూ నాన్‌స్టాప్‌గా దూసుకెళుతోంది. అయితే మొదటి సీజన్‌లో కేవలం సినిమా సెలబ్రిటీలనే ఆహ్వానించిన ఆహా నిర్వాహకులు రెండో సీజన్‌కు మాత్రం కాస్త పొలిటికల్‌ టచ్‌ ఇస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ఎపిసోడ్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుని అతిథిగా ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యపరిచారు బాలకృష్ణ. ఇక రెండో ఎపిసోడ్‌కు యంగ్ హీరోలు సిద్దు జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ హాజరు కాగా మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడవి శేష్ హాజరయ్యారు. కాగా నాలుగో ఎపిసోడ్‌కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేశ్‌ రెడ్డి ముఖ్య అతిథులుగా ఆహ్వానించి మరోసారి పొలిటికల్‌ టచ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు.

కాగా నాలుగో ఎపిసోడ్‌కు సంబంధించి ఇప్పటికే ఒక ప్రోమోను విడుదల చేసింది ఆహా బృందం. ఇందులో కిరణ్ కుమార్ రెడ్డి, బాలకృష్ణ మధ్యల స్నేహబంధం, కాలేజ్‌ డేస్‌లో వీరిద్దరు చేసిన అల్లరి పనులను చాలా చక్కగా చూపించారు. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి మరో ప్రోమో విడుదలైంది. ఇందులో మాత్రం పొలిటికల్‌ విషయాలను టచ్‌ చేశారు బాలయ్య. ప్రధానంగా ఏపీ మూడు రాజధానులకు సంబంధించి కిరణ్‌కుమార్‌, సురేశ్‌ రెడ్డిలపై ప్రశ్నల వర్షం సంధించారు. దీనికి ‘ముందు ఉన్న పరిస్థితులు వేరు.. ఇప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న లిటిగేషన్స్‌తో ‘అంటూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మరోవైపు ఇదే విషయమై ‘భిన్నత్వంలో ఏకత్వం కాదు.. భిన్నత్వమే ఏకత్వం’ అంటూ మూడు రాజధానులపై ఇంట్రెస్టింగ్‌ ఆన్సర్‌ ఇచ్చారు సురేశ్‌ రెడ్డి. మరి మూడు రాజధానులతో పాటు ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతోన్న పాలిటిక్స్‌పై కిరణ్‌ కుమార్‌ రెడ్డి, సురేశ్‌ రెడ్డిల అభిప్రాయలు పూర్తిగా తెలుసుకోవాలంటే శుక్రవారం (నవంబర్‌ 25) వరకు ఆగాల్సిందే. ఎందుకంటే ఆరోజే ఈ ఎపిసోడ్‌ స్ట్రీమింగ్‌ కానుంది. కాగా ఇదే షోలో వీరిద్దరితో పాటు నటి రాధిక కూడా పాల్గొంది. మొత్తానికి ప్రోమో చూస్తుంటే సరదాగా సాగడంతో పాటు, రాజకీయ అంశాలను కూడా టచ్‌ చేసినట్లు కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..