భోపాల్ గ్యాస్ లీక్.. ప్రపంచం మరీ ముఖ్యంగా మన దేశం ఎప్పటికీ మర్చిపోని అతి పెద్ద విషాదం. 1984 డిసెంబర్ 2,3 తేదీల్లో మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గల యూనియనర్ కార్బైడ్ ఇండియా లిమిటెడ్ (యూసీఐఎల్) ప్లాంట్ నుంచి మిథైల్ ఐసోసైనేడ్ గ్యాస్ లీక్ అయ్యి వేలాది మంది ఊపిరాడక చనిపోయారు. అలాగే లక్షలాది మందిని ఆస్పత్రి పాలు చేసింది. దుర్ఘటన జరిగి 39 ఏళ్లు కావొస్తున్నా ఇప్పటికీ ఈ విపత్తు తాలూకు ఛాయలు భోపాల్ చుట్టు పక్కల ప్రాంతాల్లో కనిపిస్తోంది. విషపూరిత రసాయనాల ప్రభావంతో చాలామంది అంగవైకల్యంతో జన్మిస్తున్నారు. ఇప్పుడీ విషాద సంఘటనను ఆధారంగా చేసుకుని ఓ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. ది రైల్వే మెన్ అనే పేరుతో రూపొందుతున్నీ సిరీస్‌లో ప్రముఖ నటుడు మాధవన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే కే కే మేనన్, దివ్యేందు, బాబిల్ ఖాన్ తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి కావొచ్చిన ది రైల్వే మెన్ వెబ్ సిరీస్ నవంబర్ 18 నుంచి నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ వెబ్ సిరీస్‌కు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసింది నెట్ ఫ్లిక్స్. ది రైల్వే మెన్ వెబ్ సిరీస్‌ను నెట్ ఫ్లిక్స్, యష్ రాజ్ సంస్థ కలిపి సంయుక్తంగా నిర్మించడం విశేషం. శివ్ రావైల్ దర్శకత్వం వహిస్తున్నారు.
భోపాల్ గ్యాస్ లీకేజీ జరిగినప్పుడు అక్కడి రైల్వే ఉద్యోగులు సహృదయంతో బాధితులకు సాయం చేసేందుకు వెళ్లారు. వందలమంది ప్రాణాలను కాపాడారు. దీనినే రైల్వె మెన్ వెబ్ సిరీస్‌లో చూపించనున్నట్లు డైరెక్టర్ శివ్ రావైల్ తెలిపారు. కాగా ఈ వెబ్ సిరీస్‌లో మొత్తం 4 ఎపిసోడ్లు ఉండనున్నాయి. ‘ది రైల్వే మ్యాన్’ అనేది ఒక యదార్థ సంఘటన నుండి ప్రేరణ పొందిన కథ. ఇది ప్రజల ప్రాణాలను కాపాడే నలుగురు వ్యక్తుల కథను వివరిస్తుంది. భోపాల్ విషాదానికి సంబంధించిన ఈ వెబ్ సిరీస్ పూర్తి పేరు ‘ది రైల్వే మ్యాన్ – ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ భోపాల్ 1984′. ఇది 4 ఎపిసోడ్‌లలో ప్రసారం కానుంది’ అని డైరెక్టర్ చెప్పుకొచ్చారు. కాగా బాలీవుడ్‌లో హిట్ సినిమాలను తెరకెక్కిస్తూ తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది యష్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ. ఇప్పుడు ఓటీటీ రంగంలోకి అడుగుపెడుతోంది. ఇందులో భాగంగా ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్‌తో చేతులు కలిపిన వైఆర్‌ఎఫ్ రెండు వెబ్ సిరీస్‌లను ప్రకటించింది. అందులో ఒకటి ది రైల్వే మ్యాన్ కాగా మరొకటి మహారాజ్. ఇందులో జైదీప్ అహ్లావత్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..