షణ్ముఖ్ జస్వంత్.. చూడగానే మన ఇంట్లో అబ్బాయిగా కనిపిస్తుంటాడు.. తన నటనతో అటు యూత్‌ను.. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకోవడంలో షణ్ముఖ్ నేర్పరి అనుకోవచ్చు. ఇప్పుడు షణ్ముఖ్ జస్వంత్ పేరు యూట్యూబ్ సెర్చింజన్లోనే నెంబర్ వన్. గతంలో “సాఫ్ట్వేర్ డెవలపర్” వెబ్ సిరీస్‌తో మిలియన్ల ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్నాడు. “సాఫ్ట్వేర్ డెవలపర్” సిరీస్‌తో యూట్యూబ్‌లో సంచలనం సృష్టించిన షణ్ముఖ్.. ఇటీవల “సూర్య” వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక “సూర్య” మొదటి ఎపిసోడ్ యూట్యూబ్‌లో నంబర్ వన్ ట్రెండింగ్‌లో ఉంటూ.. మిలియన్స్ వ్యూస్ దక్కించుకుంది. వారం వారం ఎపిసోడ్స్ విడుదల చేస్తూ వచ్చిన సూర్య నిన్న (జూన్ 7)న చివరి ఎపిసోడ్‌తో ముగించేశారు.
“సూర్య” వెబ్ సిరీస్ మనకు తెలియని కథ కాదు.. ప్రతి సామాన్యుడి ఇంటిలో జరిగే స్టోరినే ఇది.. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ.. లక్షలకు అప్పులు చేసి మరి కొడుకును ఇంజినీరింగ్ చదివిస్తాడు ఓ మిడిల్ క్లాస్ తండ్రి. చదువంటే ఇష్టపడే చెల్లి.. ఇంటి నిండా అప్పులు.. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండే హీరో. కథ మొదలవ్వగానే అందులో లీనమైపోతుంటాము. చదువులు పూర్తైన ఉద్యోగం రాకుండా.. వెళ్లిన ప్రతి ఇంటర్వ్యూలో ఏదో ఒక కారణంతో వెనుదిరగడం.. నిత్యం అప్పులతో తండ్రి పడే కష్టాన్ని… మంచి ర్యాంక్ సాధించిన చెల్లికి పెళ్లిని ఆపేయాలని అనిపించిన.. ఏం చేయలేని పరిస్థితుల్లో అనుక్షణం మానసికంగా కృంగిపోయే మిడిల్ క్లాస్ యువకుడి పాత్రలో షణ్ముఖ్ నటన అద్భుతం. హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన ప్రతీసారి.. ఇలాంటి అమ్మాయి జీవితంలోకి వస్తే పండగే అనిపించేలా ఉంటుంది.. “సూర్య” వెబ్ సిరీస్‌లోని అన్ని పాత్రలు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా రాసాడు సుబ్బు.
“సూర్య” వెబ్ సిరీస్ మొత్తం ఒకదాన్ని మించి మరొకటి ఉండేలా తెరకెక్కించాడు సుబ్బు..సూర్య పాత్రకు షణ్ముఖ్ జస్వంత్ ప్రాణం పోసాడు.. సూర్య ప్రేయసిగా మౌనికా రెడ్డి అద్భుతంగా నటించింది.. హీరో ఫ్రెండ్ పాత్రలో రవి శివ తేజ చాలా బాగా నటించాడు.. తండ్రి పాత్రకు మురళీ కృష్ణ సరిగ్గా సరిపోయాడు. ఇలా ప్రతీ ఒక్కరు తమ తమ పాత్రల్లో ఒదిగిపోయారు. ఇక నిన్న విడుదలైన చివరి ఎపిసోడ్లో షణ్ముఖ్ తన నటనతో మరోసారి అభిమానులను ఏడిపించేసాడు. రూపాయి కూడా తీసుకోకుండా.. ఎంతో కష్టపడి మూడు నెలలు చేసిన ఇంటర్న్‌షిప్ తర్వాత జాబ్ రాకపోవడంతో సూర్య మానసికంగా బాధపడుతూ.. అందరికి దూరంగా ఒంటిరిగా ఉండిపోవడం.. గర్ల్ ఫ్రెండ్, స్నేహితుడిని కూడా దూరం పెట్టడం.. ప్రస్తుత మిడిల్ క్లాస్ అబ్బాయి మనోవేదనను స్క్రీన్ పై చూపించాడు సుబ్బు. ఇక తన స్నేహితుడు చెప్పిన మాటలతో తనపై విశ్వాసం పెట్టుకుని ఓ పెద్ద సంస్థలో ఉద్యోగం సాధించినప్పుడు ఆ యువకుడి బాధను అధిగమించి.. సంతోషాన్ని వ్యక్తపరిచే సన్నివేశంలో షణ్ముఖ్ నటన ప్రేక్షకులకు కూడా కన్నీళ్లను తెప్పించింది అనడంలో అతిశయోక్తి లేదు. చివరకు సంవత్సరానికి రూ.15 లక్షల ఉద్యోగం సాధించి.. ఇంటి సమస్యలను తొలగించి.. తండ్రికి అండగా.. కోరుకున్న అమ్మాయిని జీవిత భాగస్వామిగా చేసుకుని సూర్య జీవితంలో సక్సెస్ అవ్వడంతో “సూర్య” వెబ్ సిరీస్ ముగించాడు సుబ్బు. జీవితం మనకు కచ్చితంగా ఇస్తుంది.. కాకపోతే ఇచ్చేవరకు ఆగిన వాడికే విజయం దక్కుతుందని అందంగా చెప్పాడు సుబ్బు. మొత్తానికి “సూర్య” వెబ్ సిరీస్ ఒడిదుడుకుల మధ్య సాగే అందమైన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ప్రయాణం..