Money Heist: ఓటీటీ ప్లాట్ ఫామ్‌లపై ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా.. మనీ హెయిస్ట్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సాధారణంగా దేశీయంగా తెరకెక్కే సినిమాలు, వెబ్ సిరీస్‌లకోసం జనం ఎదురు చూస్తున్నారంటే అందులో ప్రత్యేకత ఏముండదు. కానీ అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కిన ఓ వెబ్ సిరీస్‌కు భారత్‌లోనూ అభిమానులు ఉండడం నిజంగా ఆశ్చర్యం కలిగించే అంశమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు. ఇదిలా ఉంటే తాజాగా మనీ హెయిస్ట్ ఫైనల్ సీజన్ సెప్టెంబర్ 3వ తేదీ నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సిరీస్ కోసం ప్రేక్షకులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. తాజాగా జైపూర్‌కు చెందిన ఓ ఐటీ కంపెనీ తీసుకున్న నిర్ణయం ఈ సిరీస్‌పై ఉన్న క్రేజ్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.
ఇంతకీ విషయమేంటంటే.. జైపూర్‌కు చెందిన వెర్వి లాజిక్ అనే ఐటీ కంపెనీ మనీ హెయిస్ట్ ఫైనల్ సీజన్ ప్రారంభం నేపథ్యంలో సెప్టెంబర్ 3న సెలవు ప్రకటించింది. అంటే ఈ కంపెనీ ఉద్యోగులకు ఈ వీకెండ్ మూడు రోజులు రానుందన్నమాట. దీంతో ఉద్యోగులంతా మూడు రోజుల్లో సిరీస్ మొత్తం చూసుకునేలా కంపెనీ అవకాశం కలిపించింది. నెట్‌ఫ్లిక్స్ అండ్ చిల్ హాలీడే పేరుతో సెలవు ప్రకటిస్తూ కంపెనీ సర్కులర్ జారీ చేసింది. ప్రస్తుతం ఈ సర్కులర్‌కు సంబంధించిన ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ లేఖలో.. ‘అందరూ ఒకేసారి మానేస్తారు. అందుకు వేర్వేరు కారణాలు చెబుతారని మాకు అర్థమైంది. దీన్ని నివారించేందుకే నేనే ముందుగా సెలవు ఇచ్చేస్తున్నా’ అని కంపెనీ సీఈవో పేర్కొన్నారు.
Also Read: TS EAMCET 2021: విద్యార్థులకు కీలక సూచన.. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో మార్పులు..