Allu Arjun: తొలి తెలుగు ఓటీటీ సంస్థగా దూసుకొచ్చింది ఆహా. వచ్చి రాగానే సంచలనం సృస్టించిన ఈ సంస్థ ఓటీటీ రంగంలో తనదైన ముద్ర వేసింది. అత్యంత తక్కువ సమయంలో ఎక్కువ ప్రేక్షకాదరణ పొందిన సంస్థగా అరుదైన గుర్తింపును సంపాదించుకున్న ఆహా మొదలై 20 నెలలు గడుస్తోంది. ఈ తక్కువ సమయంలోనే 50 మిలియన్ల యూజర్లు, 13 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్స్‌తో దూసుకుపోతోంది. ఇతర ఓటీటీ సంస్థలకు భిన్నంగా టాక్‌షోలు, ఒరిజినల్స్‌తో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఈ క్రమంలోనే దీపావళి పండుగను మరింత ఉత్సాహాంగా జరపడానికి ఆహా.. రీలోడెడ్ వెర్షన్‌తో దూసుకురానుంది. ఇందులో భాగంగానే నవంబర్ 2 సాయంత్రం 5 గంటలకు ఓ ప్రత్యేక కార్యక్రమానికి నిర్వహించనున్నారు.
హైదరాబాద్ నోవాటెల్‌లో జరగనున్న ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి అల్లు అర్జున్ ప్రజెంటర్‌గా వ్యవహరిస్తుండడం మరో విశేషం. అల్లు అరవింద్, జూపల్లి రాము రావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఆహా 2.0ను ప్రారంభించనున్నారు. ఇక అప్‌గ్రేడ్ వెర్షన్‌లో ప్రేక్షకులకు మరింత వినోదాల విందును అందించనుంది ఆహా. ఆడియో, వీడియో పరంగా మరింత నాణ్యతతో కూడిన వరల్డ్ క్లాస్ ఫీచర్స్‌ను అందిచనున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ 2.0 లాంచింగ్ కార్యక్రమంలో త్వరలో ఆహాలో రానున్న సూపర్ హిట్ చిత్రాలు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, లక్ష్య, మంచిరోజులొచ్చాయి. డీజే టిల్లు, రొమాంటిక్, అనుభవించు రాజా, పుష్పక విమానం, గని వంటి ఫిక్షనల్, నాన్ ఫిక్షనల్ చిత్రాలతో పాటు ఆహా ఒరిజినల్స్ అయిన అన్‌స్టాపబుల్, సేనాపతి, భామా కలాపం, త్రీరోజెస్ వంటి చిత్రాలకు సంబంధించి కూడా వివరాలను తెలియజేయనున్నారు. మరి ఆహా అప్‌డేటెడ్ వెర్షన్ తెలుగు ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతి అందించనుందో తెలియాలంటే సాయంత్రం వరకు వేచి చూడాలి.