విక్రమ్ లగడపాటి.. ఈ పేరు వింటే పెద్దగా గుర్తుపట్టకపోవచ్చు కానీ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ సినిమాలో అన్వర్ అనే ముస్లిం కుర్రాడు అంటే చాలామందికి ఇట్టే గుర్తొస్తాడు. కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, రుద్రమదేవి, పటాస్, రేసుగుర్రం తదితర చిత్రాల్లో ఛైల్డ్ ఆర్టిస్టుగా నటించిన అతను గోలిసోడా మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. కన్నడలో తెరకెక్కిన ఈ చిత్రం తెలుగులోనూ ‘ఎవడూ తక్కువ కాదు’ పేరిట డబ్ అయ్యింది. ఇక దిల్ రాజు ‘రౌడీ బాయ్స్’ లోనూ కాలేజీ కుర్రాడిగా మెప్పించాడు విక్రమ్. తాజాగా అతను హీరోగా నటించిన చిత్రం వర్జిన్ స్టోరి. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో సౌమిక హీరోయిన్‌గా నటించింది. ప్రదీప్ అట్లూరి దర్శకత్వం వహించాడు. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో నేరుగా విడుదలైందీ మూవీ. ఏప్రిల్21 నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న వర్జిన్ స్టోరీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోందని హీరో విక్రమ్ లగడపాటి తెలిపాడు.
‘వర్జిన్ స్టోరీకి ఇంత గ్రాండ్ రెస్పాన్స్ నేను అస్సలు ఊహించలేదు. ఈ క్రెడిట్ అంతా ఈ చిత్రానికి పని చేసిన ప్రతి ఒక్కరికీ చెందుతుంది. వర్జిన్ స్టోరీని ఆదరిస్తున్న ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు. త్వరలోనే నా కొత్త ప్రాజెక్టు డీటెయిల్స్ వెల్లడిస్తాను’ అని చెప్పుకొచ్చాడు విక్రమ్. ఈ సినిమాలో జీవా, తాగుబోతు రమేష్, భద్రం, జబర్దస్త్ అప్పారావు, రాకెట్ రాఘవ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అచ్చు రాజమణి సంగీతం అందించారు.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..