బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన చిత్రం లాల్‌సింగ్ చడ్డా. కరీనా కపూర్ హీరోయిన్‌గా నటించింది. టాలీవుడ్ హీరో అక్కినేని నాగచైతన్య ఓ కీలక పాత్ర పోషించాడు. ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న ఫారెస్ట్ గంప్ కు హిందీ రీమేక్‌గా దర్శకుడు అద్వైత్ చందన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. వయాకాం 18 స్టూడియోస్‌తో కలసి తన సొంత నిర్మాణ సంస్థ ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఆగస్టు11న హిందీతో పాటు తెలుగులోనూ విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అంచనాలు సాధించలేకపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి సమర్పకుడిగా వ్యవహరించినా ఫ్యాన్స్‌ను మెప్పించలేకపోయింది. దాదాపు రూ.180 కోట్లతో తెరకెక్కిన ఈ మూవీ మోస్తరు కలెక్షన్లతోనే సరిపెట్టుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన లాల్‌సింగ్ చడ్డా అప్పుడే ఓటీటీలోకి వచ్చేసింది.
కాగా లాల్ సింగ్ చడ్డా డిజిటల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందు కోసం రూ.100కోట్లకు పైగా చెల్లించిందట. ఇప్పుడు ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారమవుతోంది. ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ సంస్థ ధ్రువీకరించింది. ‘లాల్ సింగ్ చడ్డా ఇప్పుడు ప్రసారమవుతోంది. మీ పాప్‌కార్న్, పానీపూరీలను సిద్ధంగా ఉంచుకోండి’ అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. కాగా థియేట్రికల్ విడుదలైన ఆరు నెలల తర్వాత సినిమా ఓటీటీలో విడుదలవుతుందని గతంలోనే ఆమిర్ ఖాన్ తెలిపారు. అయితే బాక్సాఫీస్ వద్ద సినిమా బోల్తా కొట్టడంతో ఎనిమిది వారాలకే ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చింది. కాగా ఎలాంటి ప్రమోషన్లు, హడావిడి లేకుండానే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..