అంతర్జాతీయ వేదికపై ఆస్కార్ సందడి మొదలైంది. సినీరంగంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ అవార్డ్ ప్రధానోత్సవం వేడుకలు అమెరికాలో జరగబోతున్నాయి . ప్రతి ఏడాది సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిభ కనబరిచిన నటీనటులకు, సినిమాలకు ఈ అవార్డ్ ప్రదానం చేస్తారు. ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకలకు ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు అమెరికాకు బయలుదేరుతున్నారు. ఇప్పటికే మన టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి దర్శకధీరుడు రాజమౌళి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అమెరికా పర్యటనలో ఉండగా.. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైతం అమెరికాకు చేరుకున్నారు. ఆస్కార్ బరిలో మన తెలుగు చిత్రం ఆర్ఆర్ఆర్ నిలవడంతో భారతీయులతోపాటు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఆస్కార్ అవార్డ్ కార్యక్రమం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ఈ ఆస్కార్ అవార్డుల వేడుక లైవ్ లో చూసే అవకాశం కల్పించేందుకు సన్నాహాలు చేస్తున్నారు నిర్వాహకులు. ఇందుకోసం ప్రముఖ ఓటీటీ సంస్థతో ఒప్పందం కుదుర్చున్నట్లుగా సమాచారం. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ లైవ్ స్ట్రీమింగ్ చేయనుంది. ఈ విషయాన్ని సోమవాహం హాట్ స్టార్ ట్విట్టర్ వేదికగా అధికారికంగా ప్రకటించింది.
మార్చి 13న ఉదయం 5.30 గంటల నుంచి హాట్ స్టార్ ఓటీటీలో లైవ్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలిపారు మేకర్స్. దీంతో ఆస్కార్ ఈవెంట్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సినీ ప్రియులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఆస్కార్ వేడుక వచ్చే ఆదివారం మార్చి 12న సోమవారం తెల్లవారుజామున జరగనుంది.