Balakrishna: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారం ఎంతటి చర్చకు దారి తీసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై టీడీపీ నేతలు నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఇక కేవలం పార్టీ నేతలే కాకుండా ఎన్టీఆర్ కుటుం సభ్యులు కూడా ఒక్కొక్కరూ ఈ వివాదంపై స్పందిస్తున్నారు. ఎన్టీఆర్ పేరు మార్చుతూ అసెంబ్లీ బిల్లును ఆమోదించడంపై ఎన్టీఆర్ వారసులు జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌తో పాటు పలువురు వైసీపీ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించగా తాజాగా నట సింహం, నందమూరి తారకరామరావు తనయుడు బాలకృష్ణ ఫైర్ అయ్యారు. ఫేస్ బుక్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
ఈ సందర్భంగా బాలయ్య.. ‘మార్చెయ్యటానికీ తీసెయ్యటానికి NTR అన్నది పేరుకాదు. ఓ సంస్కృతి.. ఓ నాగరికత.. తెలుగుజాతి వెన్నెముక. తండ్రి గద్దెనెక్కి ఎయిర్ పోర్ట్ పేరు మార్చాడు. కొడుకు గద్దెనెక్కి యూనివర్సిటీ పేరు మారుస్తున్నాడు. మిమ్మల్ని మార్చటానికి ప్రజలున్నారు. పంచభూతాలున్నాయ్ తస్మాత్ జాగ్రత్త. అక్కడ ఆ మహనీయుడు పెట్టిన భిక్షతో బతుకుతున్న నేతలున్నారు.. పీతలున్నారు.. విశ్వాసంలేని వాళ్లని చూసి కుక్కలు వెక్కిరిస్తున్నాయి. శునకాలముందు తలవంచుకు బతికే సిగ్గులేని బతుకులు’ అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు. మరి ఇంత వ్యతిరేకతలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఎన్టీఆర్ పేరు మార్పు విషయంలో వైసీపీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..