Susarla Dakshinamurthi : రిహార్సిల్స్ లో ఆయన పాట నేర్పుతుంటే ఆ రేంజ్ గొంతు నాకే వినపడేది కాదు – పి బి. శ్రీనివాస్
ఆయన అసలు పేరు సుస్వరాల దక్షిణామూర్తి అయితే వాడుకలో అది సుసర్ల దక్షిణామూర్తి అయి ఉంటుంది – బాల సుబ్రహ్మణ్యం
ఆయన గురించి చెప్పడం అంటే పువ్వు చెట్టుని గురించి, నక్షత్రాల గురించి మాట్లాడినట్టు ఉంటుంది – కీ.శే. సత్యం (సంగీత దర్శకుడు)
సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన ఏ గాయని అయినా ఆయన స్వర పరిచిన ‘నిదురపోరా తమ్ముడా’ పాటను స్టేజిమీద పాడి రావాల్సిందే – పి.సుశీల
మా తరం సంగీత దర్శకుల్లో మ్యూజిక్కి సంబందించిన నాలెడ్జ్ విషయాలు ఆయనతో పోల్చదగ్గవారు చాలా తక్కువ – జానకి
ఇవన్నీ మరణాంతరం మీడియా ముందు చెప్పిన మాటలు కావు. అలా అని ఆయన మంచి ఫామ్ లో ఉన్నప్పుడు మెప్పు కోసం, అవకాశాల కోసం చెప్పిన చెప్పినవి కావు. చెప్పిన వాళ్ళు అటువంటి అవకాశ వాదులు కానే కాదు. ప్రతిభా సంపన్నుడైన ఒక మంచి మనిషి గురించి తమ మనసుల్లో వున్న అభిప్రాయాన్ని చెప్పుకునే అవకాశం కోసం ఎదురు చూసే వాళ్ళే.. సుసర్ల దక్షిణామూర్తి అనగానే మనకు సినీ సంగీత దర్శకుడు, నర్తన శాల సినిమా, లతా మంగేష్కర్ ‘నిదుర పోరా తమ్ముడా’ గుర్తుకొస్తాయి. కానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులకు మాత్రం మంగళంపల్లి బాల మురళీ కృష్ణ, ఆయన గురువు రామకృష్ణయ్య పంతులు, వారి గురువు సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి గుర్తొస్తారు. వారి మనుమడే మ్యూజిక్ డైరెక్టర్ సుసర్ల దక్షిణామూర్తి గారు…
సుసర్ల దక్షిణా మూర్తి గారు జన్మించింది. నవంబర్ 11, 1921. సుసర్ల దక్షిణామూర్తి గారి పూర్తి పేరు “సుసర్ల దక్షిణామూర్తి శాస్త్రి”. వీరి తల్లిదండ్రులు అన్నపూర్ణ, కృష్ణబ్రహ్మ శాస్త్రి లు. వీరు కృష్ణజిల్లా దివిసీమలో దక్షిణకాశీగా ప్రసిద్ధికెక్కిన పెదకళ్ళేపల్లి గ్రామంలో జన్మించారు. వీరి తాతగారి పేరే ఈయనకూ పెట్టారు. దక్షిణామూర్తి తాత స్వయాన త్యాగయ్య శిష్యుడైన మానాంబుచావడి (ఆకుమళ్ళ) వెంకటసుబ్బయ్యకు శిష్యుడు. సుసర్ల దక్షిణామూర్తి తండ్రిగారి దగ్గరే సంగీతం నేర్చుకున్నారు. గాత్రం, వయోలిన్ నేర్చుకున్నారు. పదమూడు సంవత్సరాల ప్రాయంలోనే గాత్రంతో, వయోలిన్ తో అనేక రాజాస్థానాలోల కచేరీలు ఇచ్చేరట. పదహారో ఏట గజారోహణ జరిగిందిట. విజయవాడ లో తిరుపతి వేంకట కవులు సుసర్ల వారి గాత్రకచేరి విని ఎంతో మెచ్చుకొని వారిపై పద్యం ఆశువుగా చెప్పేరట. వారు వయొలినే కాకుండా హార్మోనియం, అరుదుగా వేణువు కూడా వాయించేవారు ఇవన్నీ సుసర్ల ప్రతిభకు నిదర్శనం
దక్షిణామూర్తి గారు తల్లిదండ్రులు తెనాలి లో ఉండగా కాంచనమాల ద్వారా దక్షిణా మూర్తి గారి ప్రతిభ విన్న భీమవరపు నరసింహారావు గారు తెనాలి వచ్చి వారి గానం విని మదరాసు కు ఆహ్వనించారు. ప్రఖ్యాత సినీ సంగీత దర్శకులు భీమవరపు నరసింహారావు వద్ద చేరి, 1937 నుంచి సహాయకునిగా పనిచేసారు. పర్లాకిమిడి రాజా గజపతిదేవ్ తీసిన ‘నారద నారది’ (1946) చిత్రంతో సుసర్ల దక్షిణామూర్తి తొలిసారిగా సంగీత దర్శకత్వం చేపట్టారు. సంగీత దర్శకులు ఎస్.పి. కోదండపాణి, ఏ.ఏ. రాజ్, శ్యామ్ మొదలైనవారు ఈయన వద్ద పనిచేసినవాళ్ళే! అలాగే, ప్రముఖ సంగీత దర్శకుడు ఎం.ఎస్. విశ్వనాథన్ సైతం సుసర్ల వద్ద హార్మోనిస్టుగా పనిచేశారు.
సంగీత దర్శకుడిగా సుసర్ల ప్రధానంగా హార్మోనియమ్ మీదే బాణీలు కట్టేవారు. జమునా రాణి, పి. లీల, బెంగుళూరు లత మొదలైన గాయనీమణులకు తొలి అవకాశం ఇచ్చి, పరిచయం చేసింది – సుసర్లే! ‘సంతానం’ (1955)తో లతా మంగేష్కర్‌నూ, ‘ఇలవేలుపు’ (1956)తో రఘునాథ్ పాణిగ్రాహినీ, ‘వచ్చిన కోడలు నచ్చింది’ (1959)తో ఎం.ఎల్. వసంత కుమారినీ, ‘నర్తనశాల’ (1963)తో మంగళంపల్లి బాలమురళీకృష్ణనూ సుసర్ల దక్షిణామూర్తి తెలుగు చిత్ర రంగానికి పరిచయం చేశారు. ‘నారద నారది’లో చిన్నవేషం, రాజ్యం పిక్చర్స్ ‘హరిశ్చంద్ర’ చిత్రంలో కాశీ రాజు వేషం వేశారు.
ఆంధ్ర రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రార్థనా గీతం పాడి జవహర్‌లాల్ నెహ్రూ చేతులమీదగా సన్మానం అందుకున్నారు. వివిధ ప్రైవేటు సాంస్కృతిక, కళా సంస్థలు ఎన్నో సన్మానాలు, సత్కారాలు చేశాయి. బిరుదులు ప్రదానం చేశాయి. ‘స్వరశిల్పి’, ‘సంగీత కళాప్రపూర్ణ’, ‘సుస్వరాల సుసర్ల’, ‘స్వరబ్రహ్మ’, ‘సంగీత కళానిధి’, ‘సంగీత సమ్రాట్’, ఎన్టీఆర్ పేర్కొన్న ‘స్వర సుధానిధి’ లాంటి బిరుదులు సుసర్లకు దక్కాయి. విదేశాలలో కూడా కచ్చేరీలు చేసి, తమ సంగీత వైభవాన్ని సుసర్ల చాటుకున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాల చలన చిత్రజీవితం సాగించిన సుసర్ల దక్షిణామూర్తి సంఖ్యాపరంగా తక్కువ సినిమాలకే స్వరకల్పన చేశారు… అయితేనేం ఆయన బాణీల్లో రూపొందిన ఎన్నో పాటలు ఈ నాటికీ వీనులవిందు చేస్తూనే ఉన్నాయి… ఆయన స్వరకల్పనలో ఎందరో గానకోకిలలు తమ భవిష్యత్తుకు బంగారుబాటలు వేసుకున్నారు…యన్టీఆర్, ఏయన్నార్ అన్నదమ్ములుగా నటించిన ‘సంసారం’ చిత్రానికి సుసర్ల సంగీతం ఆ రోజుల్లో బిగ్ హిట్…
కాల క్రమేణా షుగర్ వ్యాధి ముదరడం వల్ల ఆయనకు చూపు పోయింది. వయోభారంతో వినికిడి శక్తి బాగా తగ్గి పోయింది. వృద్ధాప్యం వల్ల శారీరకంగా నీరసించి మరణించారు. మరణించేముందుకూడా నను హాస్పటల్ కి తీసుకు వెళ్ళొద్దు అని స్పష్టం గా చెప్పి మరీ పోయారు సుసర్ల. ఏది ఏమైనా చంద్రుడున్నంత కాలం తెలుగు వారికి ‘చల్లని రాజా ఓ చందమామా’ పాట ఉంటుంది. కంటికి నిద్ర తెలిసున్నంత వరకూ ‘నిదుర పోరాతమ్ముడా’ గుర్తుంటుంది. మంచి సంగీతం మీద గౌరవం ఉన్నంత వరకూ ‘సంగీత రాగ సుధా రస సారం’ ఆగకుండా ప్రవహిస్తూ ఉంటుంది. అదే సుస్వర వాహిని..సుసర్ల వాహిని – నేడు వర్ధంతి సందర్భంగా TV9 అక్షర నివాళి
Also Read: