Mukesh Khanna: శక్తిమాన్ నటుడు ముఖేష్ ఖన్నాపై నెటిజన్లు మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో మహిళలపై ముఖేష్ ఖన్నా చేసిన అసభ్యకర వ్యాఖ్యలు ఈ రచ్చకు కారణమయ్యాయి. యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ముఖేష్ ఖన్నా పలు అంశాలపై తన అభిప్రాయాలు వెల్లడిస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నాడు. తాజాగా పోస్టు చేసిన ఒక వీడియోలో సెక్స్ ను కోరుకునే మహిళలను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. ‘మీరు కూడా ఇలాంటి అమ్మాయిని ఇష్టపడుతున్నారా’ అనే టైటిల్ తో పోస్టు చేసిన వీడియోలో బాలీవుడ్ నటుడు మాట్లాడుతూ.. ఎవరైనా అమ్మాయి శృంగారంలో పాల్గొనాలని అబ్బాయిని కోరితే వారు మహిళలు కాదని.. సెక్స్ వర్కర్లు అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
నాగరిక సమాజంలో పెరిగిన బాలిక ఎవరూ లైంగిక వాంఛలు తీర్చాలని యువకుడిని కోరదంటూ హాట్ కామెంట్స్ చేశాడు శక్తిమాన్. డబ్బుల కోసం ఇంటర్నెట్ లో వలపన్నే మగువల పట్ల పురుషులు జాగ్రత్తగా ఉండాలనే అర్థం వచ్చేలా మాట్లాడాడు. కొంతమంది అమాయక పురుష వ్యక్తులను టార్గెట్ చేసి కొంతమంది మహిళలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారని.. అటువంటి అమ్మాయిల పట్ల జాగ్రత్తగా ఉండాలని చెప్పాడు. మహిళలు లిమిట్స్ దాటకూడదని, సంప్రదాయాలను, కట్టుబాట్లను గౌరవించాలని ముఖేష్ ఖన్నా పేర్కొన్నాడు. ఉచితంగా తమతో శృంగారంలో పాల్గొనాలని తనకు సందేశాలు వచ్చాయంటూ రచ్చలేపే వ్యాఖ్యలు చేశాడు. ముఖేష్ ఖన్నా వ్యాఖ్యలపై అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు. అతడొక సెక్సిస్ట్ అంటూ కొందరు. సభ్యత.. సంస్కారం లేని వాడంటూ మరికొందరు శక్తిమాన్ వీడియోపై కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తలు కోసం చూడండి..