Ramarao on Duty Review: రామారావు ఆన్ డ్యూటీ.. మిస్ ఫైర్ అయిన మిస్టరీ డ్రామా..

|

Jul 29, 2022 | 1:50 PM

Ramarao on Duty Movie Review: ఏడాది మొదట్లో ఖిలాడి సినిమాతో వచ్చిన రవితేజ.. ఆర్నెళ్లు తిరక్కుండానే మరో సినిమాతో వచ్చేసారు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఈయన చేసిన సినిమా జులై 29న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది..

Ramarao on Duty Review: రామారావు ఆన్ డ్యూటీ.. మిస్ ఫైర్ అయిన మిస్టరీ డ్రామా..
Ramarao On Duty
Follow us on

Ramarao on Duty Movie Review: ఏడాది మొదట్లో ఖిలాడి సినిమాతో వచ్చిన రవితేజ.. ఆర్నెళ్లు తిరక్కుండానే మరో సినిమాతో వచ్చేసారు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ ఈయన చేసిన సినిమా జులై 29న విడుదలైంది. మరి ఈ చిత్రం ఎలా ఉంది.. ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా.. రవితేజ హిట్ కొట్టారా లేదంటే మరోసారి నిరాశ పరిచారా.. ఇవన్నీ రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: రామారావు ఆన్ డ్యూటీ

నటీనటులు: రవితేజ, రాజీషా విజయన్, దివ్యాంశ కౌశిక్, నాజర్, వేణు తొట్టెంపూడి, రాహుల్ రామకృష్ణ తదితరులు

ఇవి కూడా చదవండి

సంగీతం: స్యామ్ సిఎస్

సినిమాటోగ్రఫర్: సత్యన్ సూర్యన్

ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

దర్శకుడు: శరత్ మండవ

రిలీజ్ డేట్: జులై 29, 2022

కథ:

రామారావు (రవితేజ) సబ్ కలెక్టర్. ప్రజల కోసం పని చేసే సిన్సియర్ ఆఫీసర్. అయితే ఓ భూ వివాదం కేసులో అతన్ని సొంతూరు గుమ్మసముద్రంకు ట్రాన్స్ ఫర్ చేస్తారు. సబ్ కలెక్టర్ హోదా నుంచి ఎమ్మార్వోగా డిమోట్ చేస్తారు. తన భార్య నందిని (దివ్యాంశ కౌశిక్)తో కలిసి వచ్చేస్తాడు. ఊళ్ళో ఛార్జ్ తీసుకున్న తర్వాత తను ప్రేమించిన అమ్మాయి మాలిని (రాజీషా విజయన్) భర్త మిస్ అయ్యాడని తెలుసుకుంటాడు. ఇదే విషయాన్ని ఎస్ఐ మురళి (వేణు తొట్టెంపూడి)కి ఫిర్యాదు చేసినా అతడు పట్టించుకోడు. దాంతో రామారావు నేరుగా రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ మొదలుపెడతాడు. ఈ క్రమంలో ఆయనకు మరికొన్ని నిజాలు తెలుస్తాయి. మిస్ అయింది ఒకరో ఇద్దరో కాదు.. ఏకంగా 20 మంది అని తెలుస్తుంది. ఆ తర్వాత వాళ్ళను ఎలా పట్టుకుంటాడు.. అసలు ఈ మిస్సింగ్ వెనక ఎవరి హస్తం ఉంటుంది అనేది అసలు కథ..

కథనం:

ఒకప్పుడు రవితేజ ఏడాదికి మూడు సినిమాలు చేస్తే.. ఏదో ఒకటి బాగుండేది కాదు. ఇప్పుడలా కాదు.. మూడేళ్ళకో సినిమా కూడా బాగుండేలా చూసుకోవట్లేదు మాస్ రాజా. రామారావు ఆన్ డ్యూటీ కూడా అలాంటి వచ్చిపోయే సినిమానే. తన స్టైల్ కాకుండా.. మిస్సింగ్ మిస్టరీ అంటూ కొత్తగా ట్రై చేసారు రవితేజ. కానీ అది అటు కమర్షియల్ ఫార్మాటల్‌లో లేక.. ఇటు థ్రిల్లర్ కోటాలోకి రాక.. కంప్లీట్‌గా మిస్ ఫైర్ అయిపోయాడు రామారావు. కథ అంతా ఎర్రచందనం చుట్టూనే రాసుకున్నాడు దర్శకుడు శరత్ మండవ. అక్కడక్కడా పుష్ప ఛాయలు కూడా కనిపిస్తాయి. దాయాలన్నా దాగని విధంగా స్క్రీన్ ప్లే లోపాలు కనిపించాయి. ఎక్కడా ట్విస్టులు లేకుండా చాలా ఫ్లాట్‌గా సాగే కథనం సినిమాకు అతిపెద్ద మైనస్. ఎర్రచందనం కథను ముడిపెడుతూ మనుషులు మిస్సింగ్.. ఆ మిస్టరీని చేధించే గవర్నమెంట్ ఆఫీసర్ కథే ఇది. రొటీన్ ఫార్ములాతోనే వెళ్లే ఈ సినిమాలో ట్విస్టులు ఊహించడం అత్యాశే అవుతుంది. ఇంకా చెప్పాలంటే కథను ఎలా ముగించాలో తెలియక.. సగంలోనే నీళ్ళలో ముంచేసాడు. క్లైమాక్స్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయాడు. ఇంకా విలన్ అలాగే ఉండగానే.. సీక్వెల్ కోసం చూడాలంటూ కథ ముగించేసారు దర్శకుడు శరత్. సీరియస్ కథ రాసుకున్న శరత్.. దాన్ని స్క్రీన్ పైకి తీసుకురావడంలో పూర్తిగా గాడి తప్పారు. సినిమాలో ఒక్కటంటే ఒక్క ఇంట్రెస్టింగ్ సీన్ కూడా లేదు. రొటీన్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది కానీ అంతగా ఆకట్టుకునేలా అయితే రామారావు లేడు.

Ramarao On Duty

నటీనటులు:

రవితేజ స్క్రీన్ మీద కనిపిస్తేనే ఎనర్జీ.. కానీ రామారావులో అది కనిపించలేదు. పైగా ఈసారి వయసు కూడా బాగా బయటపడిపోయినట్లు అనిపించింది. అయినా కూడా తన పాత్రకు న్యాయం చేసారు మాస్ రాజా. దివ్యాంశ కౌశిక్, రాజీషా విజయన్ పాత్రలు ఉన్నాయంతే. హీరోయిన్లు ఇద్దరున్నా.. ఏదో ఉన్నారంతే.. వేణు తొట్టెంపూడి కారెక్టర్ గోడ మీద బల్లి.. హీరో విలన్‌కు మధ్యలో ఉండిపోయారు. ఆయన తన వరకు బాగానే చేసారు కానీ డబ్బింగ్ దగ్గర మాత్రం ఏదో మిస్ సింక్ అయింది. మిగిలిన వాళ్లంతా ఓకే..

టెక్నికల్ టీం:

స్యామ్ సిఎస్ సంగీతం పెద్దగా ఆకట్టుకోలేదు. పాటలైతే గుర్తు కూడా లేవు. ఆర్ఆర్ పర్లేదు.. సినిమాటోగ్రఫీ బాగుంది. అడవుల విజువల్స్ బాగానే కవర్ చేసారు. ఎడిటింగ్ జస్ట్ యావరేజ్ మాత్రమే. దర్శకుడు శరత్ మండవ కథ విషయంలో తీసుకున్న శ్రద్ధ.. కథనంపై కూడా తీసుకుని ఉంటే బాగుండేది. ఎందుకంటే ఎర్రచందనం నేపథ్యంలో పుష్ప వచ్చిన తర్వాత.. అంతకంటే డీప్‌గా చూపించడానికి ఏం లేదు. కాకపోతే ఇందులోనూ శరత్ బాగానే రాసుకున్నారు కానీ స్క్రీన్ ప్లే దగ్గరే తడబడ్డారు.

పంచ్ లైన్:

రామారావు ఆన్ డ్యూటీ కాదు ఆఫ్ డ్యూటీ..

(ప్రవీణ్ కుమార్, టీవీ9 ET Team, హైదరాబాద్)

మరిన్ని సినిమా వార్తలు చదవండి..