Ranabaali Review: రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి హిట్ కొట్టారా..?
టాక్సీవాలా తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంక్రీత్యన్ కాంబినేషన్లో వచ్చిన సినిమా రణబాలి. పెళ్లి తర్వాత విజయ్, రష్మిక కలిసి నటించిన మొదటి సినిమా కూడా ఇదే. పైగా హిస్టారికల్ పీరియడ్ డ్రామా కావడంతో దీనిపై అంచనాలు భారీగా ఉన్నాయి. మరి వాటిని సినిమా అందుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: రణబాలి
నటీనటులు: విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న, ఈశ్వరి రావు, లాల్, వినోద్ సాగర్ తదితరులు
సినిమాటోగ్రఫీ: జిష్ణు భట్టాచార్జీ
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్
సంగీతం: అజయ్ అతుల్
నిర్మాతలు: రవిశంకర్, నవీన్ యేర్నేని
దర్శకుడు: రాహుల్ సంక్రీత్యన్
కథ:
బ్రిటీష్ వారి పాలనలో 1850-1870ల కాలం నాటి మద్రాస్ ప్రెసిడెన్సీ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. మన దేశంలో పండిన ధాన్యాన్ని బలవంతంగా ఇంగ్లాండ్‌కు తరలించడం వల్ల స్థానికంగా తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడతాయి. తిండి లేక అల్లాడుతున్న తన ప్రజలను రక్షించుకోవడానికి, బ్రిటీష్ అధికారి సర్ థియోడర్ హెక్టర్ (ఆర్నాల్డ్ వోస్లూ) వేధింపులను ఎదిరించడానికి సింగనమల బొబ్బిలి రణబాలి (విజయ్ దేవరకొండ) ఎలా ముందుకొచ్చాడు..? అసలు భద్ర మల్లన్న దేవుడికి, రణబాలికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి..? తన ప్రాణాలను పణంగా పెట్టి వలసవాదుల ధాన్యపు ఎగుమతులను అతడు ఎలా అడ్డుకున్నాడు.. మధ్యలో జయమ్మ (రష్మిక మందన్న) తో రణబాలికి పెళ్లి ఎప్పుడు అవుతుంది..? ఆ తర్వాత పరిస్థితులు ఏంటి అనేది ఈ చిత్ర కథ..
కథనం:
చరిత్ర పుటల్లో మరుగున పడిపోయిన ఓ పాయింట్‌ను తీసుకుని దాన్ని సినిమాగా మలచడంలో దర్శకుడు రాహుల్ సంకృత్యన్ చేసిన ప్రయత్నం నిజంగా మెచ్చుకోదగినది. సినిమా ప్రారంభం కాస్త స్లోగా ఉంటుంది. హీరో ఎంట్రీ, మొదట్లో వచ్చే కొన్ని సన్నివేశాలు ప్రేక్షకులకు కనెక్ట్ కావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ మెయిన్ విలన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథ ఊపందుకుంటుంది. బ్రిటీషర్ల రాక, వారు పెట్టే చిత్రహింసలు, అప్పటి ప్రజల ఆకలి కేకలను దర్శకుడు చాలా సహజంగా, హృదయానికి హత్తుకునేలా తెరకెక్కించాడు. ఇంటర్వెల్‌కు ముందు వచ్చే యాక్షన్ ఎపిసోడ్ సెకండాఫ్‌పై భారీ అంచనాలు పెంచుతుంది. అయితే, ఆ అంచనాలను ద్వితీయార్థం కొంతమేర అందుకుంది. ఒక గుహలో వచ్చే సాలిడ్ ఫైట్‌తో సెకండాఫ్ మొదలైనా.. ఆ తర్వాత కథ మొత్తం ఊహకు అందేలా సాగుతుంది. గతంలో మనం చూసిన చాలా దేశభక్తి సినిమాల ఛాయలు ఇక్కడ పదే పదే గుర్తుకొస్తాయి. అసలు కథను ముందుకు తీసుకెళ్లకుండా, ఒకే పాయింట్ చుట్టూ సన్నివేశాలు రిపీట్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో సైతం ఎమోషన్స్ బలంగా రాసుకున్నాడు.. కాకపోతే అనవసరమైన సీన్స్ కట్ చేసి ఉంటే రిజల్ట్ మరోలా ఉండేది. ఎంతో రీసెర్చ్ చేసి అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టించిన దర్శకుడు, దాన్ని పరుగులు పెట్టించడంలో మాత్రం కాస్త నెమ్మదించాడు. హిస్టరీ ఎప్పుడూ ఇంట్రెస్టింగ్‌గానే ఉంటుంది.. రణబాలి విషయంలో దర్శకుడు రాహుల్ చెప్పాలనుకున్న కథ బాగుంది. విజయ్ గత సినిమాలతో పోలిస్తే చాలా మంచి సినిమా.. తెలిసిన చరిత్ర కావడం, ఆల్రెడీ సైరాలో ఇలాంటి సీన్స్ చూసుండటం వల్లో ఏమో కానీ.. రణబాలి అంత కొత్తగా అనిపించలేదు.. కానీ డీటైలింగ్ వరకు మాత్రం రాహుల్ అదరగొట్టేసాడు. 1850ల నాటి పరిస్థితులు, అప్పటి జనం, బ్రిటీష్ వాళ్లు పెట్టిన కష్టాలు.. అదే సమయంలో వాళ్లకు ఎదురుతిరిగే ఓ పాలెగాడు.. ఇదే రణబాలి కథ. హైలైట్ ఉంది అని విజిల్ వేయించే సీన్స్ కంటే.. మంచి కథ చెప్పాలనేదాని పైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు దర్శకుడు రాహుల్ సంక్రీత్యన్. అందుకే ఈ సినిమా నెరేషన్ ఫ్లాట్‌గా వెళ్తుంది.. ఇంటర్వెల్‌కు ముందు ఓ ఫైట్ అదిరిపోతుంది. ఎమోషన్ విషయంలోనూ రాహుల్ కాస్త ఎక్కువ టైమ్ తీసుకున్నాడు.. ఆకలి బాధలు ఎలా ఉంటాయో చాలా క్లియర్‌గా చూపించాడు ఈ సినిమాలో..! అక్కడక్కడా కొన్ని ల్యాగ్ సీన్స్ తీసేసి.. 3 గంటలను 2.30 గంటలు చేస్తే సినిమా బాగుంటుంది.
నటీనటులు:
సింగనమల బొబ్బిలి రణబాలి పాత్రలో విజయ్ దేవరకొండ పూర్తిగా ఒదిగిపోయాడు. అతని లుక్, కడప యాస పలికిన విధానం చాలా బాగున్నాయి. ముఖంలో రౌద్రం చూపిస్తూ తన పాత సినిమాల కంటే ఇందులో ఎంతో పరిణతి చెందిన నటనను కనబరిచాడు. అయితే యాక్షన్ సీన్స్ లో అతని బాడీ లాంగ్వేజ్ కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది. ఇక జయమ్మ పాత్రలో రష్మిక మందన్న అద్భుతంగా నటించింది. ఎమోషనల్ సీన్స్‌లో చాలా సెటిల్డ్‌గా కనిపించింది. విజయ్, రష్మిక మధ్య కెమిస్ట్రీ సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్. క్రూరమైన బ్రిటీష్ అధికారిగా హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వోస్లూ తన స్క్రీన్ ప్రెజెన్స్‌తోనే భయపెట్టాడు. హీరో తల్లిగా ఈశ్వరీ రావు, కీలక పాత్రలో వినోద్ సాగర్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. మిగిలిన వాళ్లు ఓకే..
టెక్నికల్ టీం:
అజయ్-అతుల్ అందించిన పాటలు పర్వాలేదనిపిస్తాయి. విజువల్‌గా ఆ పాటలు తెరపై బాగున్నాయి కానీ, వాళ్లు ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం మన తెలుగు నేటివిటీకి, ఆ ఎమోషన్‌కు సరిగ్గా సింక్ కాలేదు. జిష్ణు భట్టాచార్జీ, నిరవ్ షా సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం పోసింది. అప్పటి కాలాన్ని, గుహల్లో వచ్చే ఫైట్లను కెమెరాలో బంధించిన తీరు అద్భుతం. కార్తీక శ్రీనివాస్ ఎడిటింగ్ సెకండాఫ్ ఇంకాస్త ఫోకస్ చేయాల్సింది. కొన్ని సీన్స్ ట్రిమ్ చేసుంటే ఇంకా బాగుండేది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ విలువల పరంగా ఎక్కడా రాజీ పడకుండా కథకు అవసరమైనంత ఖర్చు పెట్టి సినిమాను రిచ్ గా తెరకెక్కించారు.
పంచ్ లైన్:
ఓవరాల్‌గా రణబాలి.. ఆకట్టుకునే పీరియడ్ యాక్షన్ డ్రామా..!
