Priyuralu Movie Review: సామాజిక బాధ్యత… మనసులో ఇష్టం… మధ్యలో ‘ప్రియురాలు’

| Edited By: Ravi Kiran

Sep 17, 2021 | 8:48 PM

డైరక్టర్స్ కి ఒక సిగ్నేచర్‌ ఉంటుంది. వాళ్లు తీసిన సినిమాల సంఖ్య చాంతాడంత లేకపోయినా, ఒకట్రెండు సినిమాలతోనే ఇంపాక్ట్ క్రియేట్‌ చేస్తారు. అలాంటివారిలో మల్లెలతీరంలో రామరాజు ఒకరు.

Priyuralu Movie Review: సామాజిక బాధ్యత... మనసులో ఇష్టం... మధ్యలో ప్రియురాలు
Priyuralu Movie Review
Follow us on

డైరక్టర్స్ కి ఒక సిగ్నేచర్‌ ఉంటుంది. వాళ్లు తీసిన సినిమాల సంఖ్య చాంతాడంత లేకపోయినా, ఒకట్రెండు సినిమాలతోనే ఇంపాక్ట్ క్రియేట్‌ చేస్తారు. అలాంటివారిలో మల్లెలతీరంలో రామరాజు ఒకరు. మల్లెలతీరంలో సిరిమల్లె పువ్వు, ఒక మనసు సినిమాల దర్శకుడు రామరాజు… ఇప్పుడు రూటు మార్చి తీసిన సినిమా ప్రియురాలు. కొత్త రూట్లో రామరాజు డ్రైవింగ్‌ ఎలా ఉంది? చూద్దాం…

సినిమా: ప్రియురాలు
నటీనటులు: పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల , శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగి నాయుడు తదితరులు
బ్యానర్‌: రామరాజు సినిమా
నిర్మాతలు: రామరాజు, అజయ్‌ కర్లపూడి
సంగీతం: సునీల్ కశ్యప్,
సినిమాటోగ్రఫీ: మహి పి రెడ్డి,
ఎడిటర్ : సాయి రేవంత్,
కథ: శ్రీ సౌమ్య,
సహ నిర్మాతలు : గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు,
దర్శకత్వం: రామరాజు

మాధవ్‌ జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. విలువల కోసం ఆలోచించే అతనికి, టీఆర్పీల వెంట పరుగులు తీసే మేనేజ్‌మెంట్‌కీ ఎప్పుడూ ఓ డిస్టర్బెన్స్ ఉంటుంది. మాధవ్‌ ఉంటున్న అపార్ట్ మెంట్‌లో పై ఫ్లాట్‌కి వస్తుంది దివ్య. చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్న ఆమెని వైజాగ్‌లో ఉన్న అమ్మమ్మ పెంచుతుంది. ఇంకో పెళ్లి చేసుకున్నాడని తండ్రి ద్వేషిస్తుంటుంది దివ్య. హైదరాబాద్‌కి వచ్చాక మెల్లిమెల్లిగా మాధవ్‌తో ప్రేమలో పడుతుంది. అయితే అతని గురించి ఓ నిజం తెలుసుకుంటుంది. ఆ నిజం వల్ల మాధవ్‌కి దూరమైందా? దగ్గరైందా? అనేది సస్పెన్స్. సేమ్‌ టైమ్‌ వాళ్లున్న అపార్ట్ మెంట్లో పనిచేసే వాచ్‌మెన్‌కి, అక్కడికి వచ్చే ఓ పనమ్మాయితో వివాహేతర సంబంధం ఏర్పడుతుంది. అది తెలిసిన వాచ్‌మేన్‌ భార్య ఏం చేసింది? వాళ్ల బిడ్డ పరిస్థితి ఏంటి? ఇటు పినతల్లి గురించి దివ్యకు తెలిసిన నిజం ఏంటి? ఆమె మీద ఎలాంటి అభిప్రాయం ఏర్పడుతుంది? వంటివన్నీ ఆసక్తికరమైన అంశాలు.

వర్క్ స్పేస్‌ రిలేషన్‌షిప్‌లు పెరుగుతున్న కాలంలో ఉన్నాం. జీవితంలో ఎక్కడో అసంతృప్తులు, ఒకరినొకరు సరిగ్గా అర్థం చేసుకోకపోవడాలు వంటివి వివాహేతర సంబంధాలకు దారి తీస్తున్నాయి. మాంగళ్యం తంతునానేనా అంటూ అగ్ని సాక్షిగా పడ్డ మూడు ముళ్లకు అర్థం తెలియక చాలా మంది బంధాలను సగంలోనే తెంచేసుకుంటున్నారు. చిన్న చిన్న కోరికలను, సరదాలను తీర్చుకోవడం కోసం క్షణికావేశంలో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇప్పుడు సొసైటీలో మనం చూస్తున్న నేరాల్లో చాలా వరకు వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్నవే.

Priyuralu Movie Review

మనుషులం కాబట్టి మనసుపడటం మామూలే. కానీ మొదలైన బంధాన్ని ఎలా కంటిన్యూ చేయాలి? ఎక్కడ కట్‌ చేయాలనే విచక్షణ చాలా ముఖ్యం. అది తెలియకపోవడం వల్ల, తెలుసుకోలేకపోవడం వల్ల చాలా దారుణాలు జరుగుతున్నాయి. ఒక రకంగా ప్రియురాలు సినిమా కూడా ఈ విషయాన్నే డీల్‌ చేసింది. తప్పని తెలిసినా నచ్చింది చేయడమే ప్రేమ అని నమ్మిన అమ్మాయి కథ. ఇన్‌ఫ్యాక్ట్ ఈ లైను ఆ అమ్మాయి జీవితానికి సరిగ్గా సరిపోతుంది. దాన్నే డీటైల్డ్ గా చెప్పడానికి ట్రై చేశారు రామరాజు. ఆమె ఉన్న అదే స్థానంలో ఒకప్పుడు ఆమె పిన్ని ఉంది, ప్రెజెంట్‌లో వాచ్‌మెన్‌ ప్రియురాలు ఉంటుంది. వాళ్లతో తనని పోల్చి చూసుకుని దివ్య ఏం నిర్ణయం తీసుకుంది? మాధవ్‌ దాన్ని అంగీకరించాడా? లేదా? మెచ్యూర్డ్ థింకింగ్‌ ఎలా ఉంటుంది? ఒక్క సరైన నిర్ణయం ఎందరి జీవితాలను సక్రమంగా నడుపుతుంది.. ఒక చిన్న తప్పు పచ్చటి సంసారాన్ని ఎలా బలితీసుకుంటుంది… ఈ ఎలిమెంట్స్ అన్నిటినీ సెన్సిటివ్‌గా డీల్‌ చేశారు రామరాజు

ఇప్పుడున్న సొసైటీలో ఇలాంటి థాట్‌ ప్రొవోకింగ్‌ సబ్జెక్టులు స్క్రీన్‌ మీదకు రావాలి. అందులోనూ ఓటీటీ యుగంలో ఉన్నాం. కాస్త గీత దాటి చెప్పినా గట్టిగా కోత కోసినట్టు చెప్పాలి. రామరాజు ఆ ప్రయత్నం చేశారు. సక్సెస్‌ఫుల్‌గా చేశారు. ప్రియురాలు చూసిన వారిలో సగం మందికి పైగానే అయినా తమ జీవితంలో జరిగిన ఘటనలో, తాము విన్నవో, కన్నవో గుర్తుకు రాకమానవు. పైకి చెప్పకపోయినా, మనసు అంతరాంతరాల్లో తప్పకుండా ఈ తరహా కథలు మరోసారి మెదిలి తీరుతాయి. అలా మెదిలినప్పుడు ఏ ఒక్కరిలో మార్పు వచ్చినా, ఏ కొంతమందో ఒక్క క్షణం మంచి వైపు ఆలోచించగలిగినా రామరాజు ప్రయత్నం సఫలమైనట్టే!

– డా. చల్లా భాగ్యలక్ష్మి, TV9 తెలుగు, ET  డెస్క్

Also Read..

Gully Rowdy Movie Review : లాజిక్కులతో కాదు… తెలిసిన కథతో సరదాగా మేజిక్‌ చేసిన గల్లీరౌడీ!

Maestro Movie Review: అంధాధున్ సినిమా… తెలుగులో మాస్ట్రోగా మెప్పిస్తుందా?.. నితిన్ మాస్ట్రో మూవీ రివ్యూ..