‘మత్తు వదలరా..’ రివ్యూ

| Edited By: Ravi Kiran

Dec 25, 2019 | 4:07 PM

నటీనటులు: శ్రీసింహా, జీవా, విద్యుల్లేఖ రామన్‌, సత్య, నరేష్‌ అగస్త్య, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, అతుల్య చంద్ర తదితరులు ప్రొడ్యూసర్స్: చిరంజీవి (చెర్రీ) , హేమలత నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్ మెంట్స్ కెమెరా: సురేష్‌ సారంగం లైన్‌ ప్రొడ్యూసర్‌: పి.టి.గిరిధర్‌, సంగీతం: కాలభైరవ రచన – దర్శకత్వం: రితేష్‌ రాణా కీరవాణి కొడుకులిద్దరూ కలిసి ఓ సినిమాతో పరిచయమవుతున్నారు. ఆల్రెడీ సింగర్‌గా ప్రూవ్‌ చేసుకున్న పెద్దబ్బాయి కాలభైరవ లేటెస్ట్ గా మ్యూజిక్‌ డైరక్టర్‌గా […]

మత్తు వదలరా.. రివ్యూ
Follow us on

నటీనటులు: శ్రీసింహా, జీవా, విద్యుల్లేఖ రామన్‌, సత్య, నరేష్‌ అగస్త్య, వెన్నెల కిశోర్‌, బ్రహ్మాజీ, అతుల్య చంద్ర తదితరులు
ప్రొడ్యూసర్స్: చిరంజీవి (చెర్రీ) , హేమలత
నిర్మాణం: మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్‌ ఎంటర్‌టైన్ మెంట్స్
కెమెరా: సురేష్‌ సారంగం
లైన్‌ ప్రొడ్యూసర్‌: పి.టి.గిరిధర్‌,
సంగీతం: కాలభైరవ
రచన – దర్శకత్వం: రితేష్‌ రాణా

కీరవాణి కొడుకులిద్దరూ కలిసి ఓ సినిమాతో పరిచయమవుతున్నారు. ఆల్రెడీ సింగర్‌గా ప్రూవ్‌ చేసుకున్న పెద్దబ్బాయి కాలభైరవ లేటెస్ట్ గా మ్యూజిక్‌ డైరక్టర్‌గా ఎంట్రీ ఇస్తున్నారు. చిన్నబ్బాయి శ్రీసింహా హీరోగా పరిచయమవుతున్నారు. రితేష్‌ రాణా డైరక్ట్ చేస్తున్న ఆ మూవీ పేరు మత్తు వదలరా. కుర్రకారు కలిసి చేస్తున్న ఈ మూవీకి మైత్రీ మూవీ మేకర్స్ లాంటి బడా సంస్థ సపోర్ట్ గా ఉంది…. ఇదీ నిన్న మొన్నటి వరకు ‘మత్తు వదలరా’కు సంబంధించి ప్రచారంలో ఉన్న న్యూస్‌. మరి అందరి అంచనాలను అందుకోవడానికి బుధవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉంది? ప్రేక్షకులను మెప్పించిందా? మత్తు వదలరా అనే టైటిల్‌ని ఎందుకు పెట్టారు? కథలోకి వెళ్దాం

కథ
బాబూ మోహన్‌ (శ్రీ సింహా), ఏసు (సత్య) ఇద్దరూ ఓ పార్సల్‌ డెలివరీ కంపెనీలో డెలివరీ బోయ్స్ గా పనిచేస్తుంటారు. అభి (నరేష్‌ అగస్త్య) వారి రూమ్మేట్‌. ఎప్పుడూ ఇంగ్లిష్‌ సీరియళ్లు చూస్తూ పొద్దుపుచ్చుతుంటాడు. 30 రోజులు కష్టపడినా, వచ్చే జీతం మూడుగంటల్లో కరిగి పోతోందని బాధపడతాడు బాబు. అతనికి తాను పాటిస్తున్న కిటుకు నేర్పుతాడు ఏసు. స్నేహితుడు నేర్పిన చిట్కాను వాడుకలోకి తెచ్చి డబ్బు సంపాదించుకుందామని నిర్ణయించుకుంటాడు బాబు. ఆ క్రమంలోనే అతను ఓ అపార్ట్ మెంట్‌కి వెళ్తాడు. అక్కడ అతనికి ఓ బామ్మ ఎదురవుతుంది. అనుకోని విధంగా ఆమె చనిపోతుంది. ఆమె మనవరాలు (విద్యుల్లేఖ రామన్‌)కి , పక్కింటి రవి (వెన్నెలకిశోర్‌)కీ పరిచయం ఉంటుంది. అదే అపార్ట్ మెంట్‌లో తేజస్వికి పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌ చేయడం కోసం వస్తాడు కానిస్టేబుల్‌ బ్రహ్మాజీ. వీరందరికీ మధ్య ఓ లింక్‌ ఉంటుంది.. అదేంటన్నది ఆసక్తికరం. అనుకోని విధంగా హత్యకు గురయిన కానిస్టేబుల్‌ సెల్‌ఫోన్‌ బాబు చేతికి ఎలా వచ్చింది? నెల జీతం కోసం 30 రోజులు వెయిట్‌ చేసి చూసే బాబు సంచిలో రూ.50లక్షలు క్యాష్‌ ఎలా వచ్చింది? తన ఇంట్లో రవి పెంచిన మొక్కలేంటి? తేజస్వి అంటే ఎవరు? పాస్‌పోర్ట్ వ్యవహారం ఎంత వరకు వచ్చింది? అభికీ, రవికీ ఉన్న లింకులేంటి? రవిని ఎవరు హత్య చేశారు? చివరికి అభి తన ఆలోచనలతో బాబుకు సాయం చేశాడా? లేదా? అసలు అభి మంచివాడేనా? ఇలాంటి ఎన్నో చిక్కుముడులకు అందమైన సమాధానం సెకండాఫ్‌లో దొరుకుతుంది.

ప్లస్‌ పాయింట్లు
– స్క్రీన్‌ప్లే
– నటీనటుల పెర్ఫార్మెన్స్
– రీరికార్డింగ్‌
– ఫస్టాఫ్‌
– లొకేషన్లు

మైనస్‌ పాయింట్లు
– కాస్త స్లోగా సాగే సెకండాఫ్‌
– క్లైమాక్స్ లో కాస్త సాగదీసినట్టున్న వీఎఫ్‌ ఎక్స్.

సమీక్ష
పేరుమోసిన కుటుంబం నుంచి వచ్చిన వారసులు చేసిన సినిమా, మరో పెద్ద సంస్థ బ్యాకింగ్‌ అనే క్రెడిట్స్ తప్ప… రిలీజ్‌కి ముందు ఎలాంటి హంగామా లేని సినిమా ‘మత్తు వదలరా’. అయితే మొదటి నుంచీ కూడా, సినిమా పోస్టర్లతో, ట్రైలర్లతో ఆకట్టుకుంది. ప్రమోషన్ కూడా వెరైటీగా చేశారు యూనిట్‌. దానికి తగ్గట్టు రితేష్‌ రాసుకున్న కథ, స్క్రీన్‌ప్లే బావుంది. సన్నివేశాలు కూడా కొత్తగా అనిపించాయి. ఆర్టిస్టులు ఎక్కడా నటించినట్టు కాకుండా, నేచురల్‌గా చేశారు. ఈ సినిమాకు ప్రధాన బలం స్క్రీన్‌ప్లే. మరిన్ని ట్విస్టులతో ఆకట్టుకుంది. దానికి తోడు కడుపుబ్బ నవ్వించిన హాస్యం కూడా సినిమాకు ప్లస్‌ అయింది. ధూమపానం, మద్యపానం సేవించకండి… అని చెప్పే డైలాగు దగ్గర నుంచే కొత్తదనాన్ని చూపించారు మేకర్స్. శ్రీసింహా తనకు తగిన పెర్పార్మెన్స్ చేశాడు. రెండు లుక్స్ అతనికి సెట్‌ అయ్యాయి. ఎక్కడా ద్వందార్థ సంభాషణలు లేవు. తెలుగు సీరియళ్లను, మెగాస్టార్‌ చిరంజీవి సినిమా సీన్లను సినిమా ప్రారంభంలో, ఇంటర్వెల్‌లో, క్లైమాక్స్ లో వాడుకున్న విధానం కూడా బావుంది. ఆఖరున ఈ కథకు ఇన్‌స్పిరేషన్‌ అని చెబుతూ వేసిన క్లిప్పింగ్‌ కూడా బావున్నాయి. 2019 ఎండింగ్‌లో చిన్న సినిమాగా విడుదలై, అందరి మన్ననా పొందుతున్న చిత్రమిది. ఆఖరులో వీఎఫ్‌ఎక్స్ చేసిన కొన్ని సన్నివేశాలు మాత్రం కొద్దిగా సాగదీసినట్టు అనిపిస్తాయి. అయితే సినిమా బావుందన్న ఫ్లోలో వాటిని ప్రేక్షకుడు పెద్దగా పట్టించుకోడు. ట్రెండీ సినిమాల్లో ఒకటిగా నిలిచిందీ చిత్రం.

ఫైనల్‌గా… చిత్రంలో… నవ్వులకు, థ్రిల్‌కు… మత్తు వదులుతుంది!

– డా. చల్లా భాగ్యలక్ష్మి