రాజశేఖర్ సతీమణి, నటి జీవితా(Jeevitha) రాజశేఖర్(RajaSekhar)పై గత నెలలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. నగరి కోర్టు ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. జ్యో స్టార్ ఎండీ హేమ, జీవితపై చెక్ బౌన్స్ కేసులో నగరి కోర్టును ఆశ్రయించారు. 26కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని ఆమె ఫిర్యాదు చేశారు. ఒకే ఆస్తిని ఇద్దరికి విక్రయించారనే ఆరోపణలు జీవితా రాజశేఖర్‌పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో హేమ కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, నగరి కోర్టు జీవితపై నాన్‌బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. తాజాగా, శుక్రవారం ఈ కేసు విచారణకు వచ్చింది.
అయితే, అనారోగ్యం కారణంగా జీవితరాజశేఖర్ కోర్టుకు హాజరుకాలేదు. ఆమె తరపు అడ్వొకేట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విచారణ జూన్ 17కు వాయిదా వేసింది నగరి కోర్టు. గతంలోనూ ఇలానే చేశారని జీవితపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు జ్యో స్టార్ ఎండీ హేమ.
గరుడ వేగ సినిమా(PSV Garuda Vega) కు సంబంధించిన ఆర్ధిక లావాదేవీల్లో రాజశేఖర్ దంపతులు అవకతవకలకు పాల్పడినట్లు ఆమె ఆరోపించారు. 2017లో రాజశేఖర్ హీరోగా గరుడవేగ చిత్రం విడుదలైంది. అప్పటి నుంచి ఈ గొడవ కొనసాగుతూనే ఉంది.