
సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ ట్రెండ్ మొదలవుతుందో ఊహించడం కష్టం. ప్రస్తుతం నెటిజన్లను, సెలబ్రిటీలను ఒక ఊపు ఊపేస్తున్న సరికొత్త ట్రెండ్ ‘2016 is the new 2026’. అంటే 2026 ప్రారంభంలో ఉన్న మనం, సరిగ్గా ఒక దశాబ్దం వెనక్కి వెళ్లి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరువేసుకోవడం అన్నమాట. ఈ క్రేజీ ట్రెండ్‌లో భాగంగా బాలీవుడ్ బేగం ఒకరు తన జీవితంలోని అత్యంత అరుదైన, అందమైన క్షణాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ తన 2016వ సంవత్సరాన్ని ‘గర్భం దాల్చిన ఏడాది’ (Year of the Bump)గా అభివర్ణించారు. ఆమె మొదటి కుమారుడు తైమూర్ అలీ ఖాన్ పుట్టకముందు నాటి అన్‌సీన్ ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇందులో ముఖ్యంగా ఆమె మూడున్నర నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఒక ప్రముఖ మ్యాగజైన్ కవర్ షూట్‌లో పాల్గొన్నారు. అయితే ఆ విషయం అప్పట్లో ఎవరికీ తెలియదనే ఆసక్తికర రహస్యాన్ని ఆమె ఇప్పుడు బయటపెట్టారు. టైగర్ ప్రింట్ స్విమ్‌సూట్‌లో తన బేబీ బంప్‌ను గర్వంగా చూపిస్తూ దిగిన మిర్రర్ సెల్ఫీ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.
Kareena Kapoor
ఈ ఆల్బమ్‌లో అన్నిటికంటే హైలైట్ ఏమిటంటే.. తైమూర్ జన్మించడానికి కేవలం 48 గంటల ముందు దిగిన ఫోటో. ఆ సమయంలో ఆమె బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్, తన సోదరి కరిష్మా కపూర్ మరియు మలైకా అరోరాలతో కలిసి సరదాగా గడిపారు. డెలివరీకి రెండు రోజుల ముందు కూడా ఆమె ఎంతో ఉత్సాహంగా స్నేహితులతో కలిసి ఉన్న తీరు చూసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. భర్త సైఫ్ అలీ ఖాన్ తన బేబీ బంప్‌ను ఆప్యాయంగా పట్టుకుని ఉన్న క్యూట్ ఫోటోలు, బాబు పుట్టిన తర్వాత హాస్పిటల్‌లో దిగిన భావోద్వేగపూరితమైన ఫోటోలు ఈ సిరీస్‌లో ఉన్నాయి.
కేవలం కరీనా కపూర్ మాత్రమే కాకుండా, అనన్య పాండే, సోనమ్ కపూర్ వంటి పలువురు నటీమణులు కూడా తమ 2016 నాటి జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. పదేళ్ల కిందట తాము ఎలా ఉండేవాళ్లమో చూపిస్తూ నెటిజన్లను ఆశ్చర్యపరుస్తున్నారు. అయితే కరీనా షేర్ చేసిన ఈ ప్రెగ్నెన్సీ జర్నీ ఫోటోలు మాత్రం అత్యధిక లైకులు, కామెంట్లతో దూసుకుపోతున్నాయి. ఒక తల్లిగా తన మొదటి సంతానం కోసం ఆమె పడిన తపన, ఆనందం ఆ ఫోటోల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. 2026లో ఉండి 2016 జ్ఞాపకాలను నెమరువేసుకోవడం నిజంగానే ఒక అద్భుతమైన అనుభూతిని కలిగిస్తోందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.