Kamal Hasan: అలాంటి కామెంట్స్ చేయొద్దు.. కమల్‌కు మరోసారి కోర్టు అక్షింతలు

కమల్ హాసన్‌కు బెంగళూరు కోర్టు మధ్యంతర నోటీసులు జారీ చేసింది. కన్నడ భాషపై ఎటువంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆదేశించింది. థగ్ లైఫ్ ప్రమోషన్స్ సందర్భంగా కన్నడపై కమల్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోర్టు మెట్లు ఎక్కగా.. న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది.

Kamal Hasan: అలాంటి కామెంట్స్ చేయొద్దు.. కమల్‌కు మరోసారి కోర్టు అక్షింతలు
Kamal Haasan

Updated on: Jul 05, 2025 | 1:36 PM

మణిరత్నం – కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన థగ్ లైఫ్ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే పలు వివాదాల్లో చిక్కుకుంది. ప్రమోషన్స్ టైమ్‌లో కన్నడ భాషపై కమల్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి. ఆ కామెంట్స్‌పై కన్నడనాట పలు సంఘాలు ఆందోళనకు దిగాయి. అయినా లోకనాయకుడు మాత్రం ఏం పట్టనట్లుగా లైట్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే థగ్ లైఫ్ సినిమాను కన్నడలో రిలీజ్ కాకుండా నిషేధించారు. దీంతో కర్ణాటక తప్ప మిగితా భాషల్లో సినిమా రిలీజ్ అయ్యింది. మరోవైపు కమల్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలంటూ పలువురు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో బెంగళూరు కోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కన్నడ భాషపై కమల్ మాట్లాడకూడదని.. ఒకవేళ మాట్లాడితే తగిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. కన్నడ సాహిత్య పరిషత్  ఈ పిటిషన్ దాఖలు చేసింది. కన్నడ భాషపై కమల్ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండా నిషేధించాలని  పిటిషన్‌లో కోరింది.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ‘‘కన్నడ భాషపై అధిపత్యాన్ని ప్రదర్శించేలా మాట్లాడకూడదు. కన్నడ భాష, సంస్కృతికి వ్యతిరేకంగా ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు’’ అని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను అగస్టు 30కి వాయిదా వేసింది. అంతకుముందు థగ్ లైఫ్ సినిమా ప్రమోషన్ సందర్భంగా కన్నడ తమిళం నుంచి పుట్టిందని కమల్ అన్నారు. దీంతో ఈ వివాదం చెలరేగింది. ప్రస్తుతం థగ్ లైఫ్ మూవీ ఓటీటీలో సందడి చేస్తోంది. కన్నడలో సినిమా రిలీజ్‌కు పర్మిషన్ ఇవ్వాలని.. గతంలో మూవీ యూనిట్ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం సినిమా రిలీజ్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ కన్నడలో మాత్రం ఇప్పటివరకు రిలీజ్ కాలేదు.