డిస్కో మ్యూజిక్‌ను సంగీత ప్రపంచానికి పరిచయం చేసిన ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరి(69) (Bappi Lahiri) బుధవారం ఉదయం కన్నుమూశారు. కొద్ది రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన కోలుకోలేక ఈ లోకం నుంచి శాశ్వతగా వెళ్లిపోయారు. డిస్కోకింగ్‌గా పేరు తెచ్చుకున్న బప్పీల హరికి సంగీతంతో పాటు బంగారు ఆభరణాలంటే కూడా ఎంతో మక్కువ. ఎక్కడ కనిపించినా ఆయన చేతికి బంగారు కడియాలు, ఉంగరాలు, మెడలో బంగారు గొలుసులు ఉండేవి. ఈక్రమంలోనే ఆయనకు ‘గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా’ అని కూడా పేరొచ్చింది. అయితే ఈ బంగారు ఆభరణాలకు సంబంధించి వివిధ సందర్భా్ల్లో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
చిన్నప్పటి నుంచే మ్యూజిక్‌పై ఆసక్తి పెంచుకున్న బప్పీలహరికి అమెరికన్ సింగర్ ఎల్విన్ ప్రెస్లీ ఎంతో అభిమానం. ఆయనకు కూడా బంగారు ఆభరణాలు ధరించడమంటే బోలెడంత ఇష్టం. ప్రెస్లీని స్ఫూర్తిగా తీసుకున్న బప్పీల హరి సంగీత ప్రపంచంలో తనకంటూ ఓ ప్రత్యేకత తెచ్చుకున్నాడు. పేరుతో పాటు బాగా డబ్బు సంపాదించిన తర్వాత బంగారు ఆభరణాలను కొనుగోలు చేయాలనుకున్నాడు. అయితే అంతకంటే ముందు ‘జాక్మీ’ పాటలు రికార్డింగ్ పూర్తి చేసిన తర్వాత ఆయన తల్లి ఒక బంగారు గొలుసు తనకు బహుమతిగా ఇచ్చిందట. అలా అప్పటి నుంచి బంగారు ఆభరణాలు ధరించడం మొదలు పెట్టాడు బప్పీలహరి. ఆతర్వాత సంపాదించిన డబ్బులో చాలా మొత్తాన్ని గోల్డ్‌కే ఖర్చుపెట్టాడు.
ఏటా ధన త్రయోదశి రోజున..
ఆయనకు బంగారం ఎంతిష్టమంటే ఏటా ధన త్రయోదశి రోజున ఏదో ఒక బంగారు ఆభరణం తప్పకుండా కొనేవారట. అంతేకాదు చాలామంది దర్శక నిర్మాతలు బంగారు ఆభరణాలనే బహుమతులగా ఇచ్చేవారట. ఈక్రమంలో 2014 బీజేపీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన బప్పీల హరి నామినేషన్ సమయంలో తన వద్ద ఉన్న బంగారం, వెండి ఆభరణాల లెక్కలను బయటపెట్టారు. తన వద్ద 754 గ్రాముల బంగారం, 4.62 కిలోల వెండి, అదేవిధంగా తన సతీమణి వద్ద 967 గ్రాముల బంగారం, 8.9 కిలోల వెండి ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. అయితే ఎన్ని ఆభరణాలు కొన్నా తన తల్లి అందించిన బంగారు లాకెట్, ‘బి’అక్షరంతో తన సతీమణి చేయించిన బంగారు గొలుసంటేనే ఎంతో ఇష్టమంటారు బప్పీలహరి.
చివరి పోస్టులోనూ గోల్డే..
సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే ఈ డిస్కో కింగ్ 2014లో సోషల్ మీడియాలోకి అడుగుపెట్టారు. నిత్యం తన మ్యూజిక్ ఆల్బమ్స్, కన్సర్ట్‌ల విశేషాలను వాటి ద్వారా అభిమానులతో షేర్ చేసుకునేవారట. అదేవిధంగా తన వ్యక్తిగత వివరాలను కూడా షేర్ చేసుకునేవారు. ఇందులో భాగంగా బంగారు ఆభరణాలు ధరించిన ఫొటోలను కూడా ఫ్యాన్స్ తో పంచుకునేవారు. ఇదిలా ఉంటే మూడు రోజుల క్రితం తన త్రో బ్యాక్ ఫొటోను షేర్ చేసిన బప్పీలహరి అందులో బంగారు ఆభరణాలు ధరించి ఎంతో స్టైలిష్‌గా కనిపించారు. దానికి ‘ఓల్డ్ ఈజ్ గోల్డ్ ‘అని క్యాప్షన్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా చాలామంది నెటిజన్లు ‘RIP’ గోల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటూ నివాళి అర్పిస్తున్నారు.
Huawei: చైనాకు చెందిన ప్రముఖ టెలికాం కంపెనీలో ఐటీ శాఖ దాడులు.. పలు రికార్డులు స్వాధీనం..
Suriya Sivakumar : సూర్య ‘ఈటి’ మూవీ నుంచి తెలుగు సాంగ్ వచ్చేసింది.. అదరగొడుతున్న పాట