
టాలీవుడ్ పరిశ్రమ కొంతమందిని అధమ పాతాళానికి తొక్కిస్తే.. మరికొందరిని ఎవ్వరూ అందుకోనంత ఎత్తుకు తీసుకెళ్తుంది. అటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే ఫేట్, లక్ ఫ్యాక్టర్ కూడా మనకు కలిసి రావాలి. ఈ నేపథ్యంలోనే కొంతమంది హీరోలు కెరీర్ ప్రారంభించిన తొలినాళ్లలోనే శిఖరానికి చేరుకుంటే.. మరికొందరు నెమ్మదిగా పైపైకి ఎదుగుతూ వస్తుంటారు. ఇప్పుడు సరిగ్గా ఇలాంటి జాతకాలు ఉన్న ఓ ఇద్దరు యంగ్ హీరోల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం.
ఆ ఇద్దరు హీరోలు ఎవరనుకుంటున్నారా.. వారెవరో కాదు ఒకరు ‘రౌడీ’ విజయ్ దేవరకొండ కాగా.. మరొకరు ఏజంట్ ‘నవీన్ పోలిశెట్టి’. దాదాపు వీరిద్దరూ కూడా ఒకే సమయంలో తమ కెరీర్‌ను ప్రారంభించారు. విజయ్ జెట్ స్పీడ్‌లో టేకాఫ్ అయితే.. నవీన్ మాత్రం తడబడుతూనే ఇప్పుడిప్పుడే హీరోగా తొలి అడుగులు వేస్తున్నాడు. నవీన్ నటించిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ గతవారం రిలీజైన సంగతి తెలిసిందే. సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఇందులో నవీన్ నటనకు మంచి మార్కులే వేశారు.
మరోవైపు ఈ ఇద్దరి హీరోల కెరీర్ తొలినాళ్ళ గురించి మాట్లాడుకుంటే.. నవీన్ పోలిశెట్టి, విజయ్ దేవరకొండ ఇద్దరూ కూడా ఒకే సమయంలో సినిమా ఆడిషన్స్‌కు వెళ్లారట. ఈ విషయాన్ని నవీనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. ‘నేను, విజయ్ కలిసి ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమా ఆడిషన్స్‌కు వెళ్ళాం. హీరో ఫ్రెండ్ క్యారక్టర్ కోసం మేం వెళ్తే.. మమ్మల్ని అపోజిట్ గ్యాంగ్‌లో వేశారు. అని నవీన్ తెలిపాడు. ఇక అక్కడ కట్ చేస్తే జరిగిన సీన్ మొత్తం మనకు తెలిసిందే. విజయ్ దేవరకొండ ‘పెళ్లి చూపులు’, ‘గీత గోవిందం’ తర్వాత టాలీవుడ్ సెన్సేషన్ అయితే.. నవీన్ హీరోగా అడుగులు వేయడం మొదలు పెట్టాడు.
ఈ ఒక్క విషయమే కాదు.. వీరిద్దరి మధ్య స్నేహం కూడా ఇప్పటికీ చెక్కు చెదరలేదు. విజయ్ దేవరకొండ.. నవీన్‌తో ఉన్న గత స్నేహాన్ని దృష్టిలో పెట్టుకుని.. తమ్ముడు ఆనంద్ దేవరకొండ సినిమాను పక్కన పెట్టి.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫిల్మ్‌ను ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇదే సినిమా హైప్ రావడానికి కూడా దోహద పడిందని చెప్పవచ్చు. దీనికి నవీన్ కూడా విజయ్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ఇక సినిమా విషయానికి వస్తే ‘డిటెక్టివ్’ పాత్రలో నవీన్ పరిణితి చెందిన నటుడుగా ఇరగదీశాడనే చెప్పాలి. అటు నవీన్ ప్రస్తుతం బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టబోతున్నాడు. హిందీలో దంగల్ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన నితేష్ తివారి దర్శకత్వంలో `చిచోరి` అనే భారీ చిత్రంలో నటిస్తున్నాడు. తెలుగులో మరిన్ని కథలు వింటున్నాడని.. త్వరలోనే కొత్త సినిమాకి సైన్ చేస్తాడని తెలుస్తోంది.
మరోవైపు శేఖర్ కమ్ముల చిత్రాలతో వచ్చిన ఇలాంటి యువ హీరోల పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే.. మొదటగా హ్యాపీ డేస్ సినిమా హీరో వరుణ్ సందేశ్ ఫేడ్ ఔట్ అయిపోగా.. నిఖిల్ నెమ్మదిగా హీరోగా ఎదుగుతున్నాడు. అటు విజయ్ దేవరకొండ సెన్సేషన్ అయిపోయాడు, నవీన్ పోలిశెట్టి హీరోగా తొలినాళ్లలో ఉన్నాడు. దీని బట్టి ఫేట్ అండ్ లక్ ఫ్యాక్టర్ హీరోల కెరీర్ తో బాగా ఆడుకుంటోందని చెప్పవచ్చు.